India Australia T20 Series : భారత్, ఆస్ట్రేలియా మధ్య ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగే టీ20 మ్యాచ్ టికెట్ల లెక్కపై స్పష్టత రావడం లేదు. స్టేడియం సామర్థ్యం 39 వేలు కాగా.. ఇప్పటివరకూ వివిధ రూపాల్లో 26,550 టికెట్లు అయిపోయాయని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు మహమ్మద్ అజహరుద్దీన్ వెల్లడించాడు. టికెట్ల విక్రయం బాధ్యత పూర్తిగా 'పేటీఎం'కే అప్పగించామని, జింఖానా ఉదంతంతో హెచ్‌సీఏకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు.
గురువారం జింఖానా మైదానంలో తొక్కిసలాట కారణంగా టికెట్ల కోసం వచ్చిన అభిమానులు కొందరు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో అజహరుద్దీన్ విలేకర్లతో మాట్లాడుతూ.. "టీమ్‌ఇండియా, ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 టికెట్ల అమ్మకంలో హెచ్‌సీఏది ఎలాంటి తప్పు లేదు. ఆ టికెట్ల విక్రయం బాధ్యతను పూర్తిగా 'పేటీఎం'కు అప్పజెప్పాం. బ్లాక్‌లో టికెట్లు అమ్ముతున్నారనే ఆరోపణల్లో నిజం లేదు"
"ఆన్‌లైన్‌లో టికెట్లు కొని బయట ఎక్కువ ధరకు అమ్మేవాళ్లపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. ఈ నెల 15న పేటీఎంలో 11450 టికెట్లు అమ్ముడయ్యాయి. కార్పొరేట్ బాక్సుల కోసం 4 వేల టికెట్లు కేటాయించాం. జింఖానాలో 2100 టికెట్లు విక్రయించారు. గురువారం రాత్రి పేటీఎంలో మరో 3 వేల టికెట్లు అభిమానులు దక్కించుకున్నారు. హెచ్‌సీఏ అంతర్గత వ్యక్తులు, వాటాదార్లు, స్పాన్సర్ల కోసం మరో 6 వేల టికెట్లు అందుబాటులో ఉంచాం"
"టికెట్ల విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. జింఖానాలో జరిగిన ఘటనతో హెచ్‌సీఏకు సంబంధం లేదు. మ్యాచ్ సందర్భంగా మైదానంలో ఏదైనా ఇబ్బందులు తలెత్తితే అప్పుడు అడగండి. మ్యాచ్‌ను ప్రేక్షకులు ఆస్వాదించేలా సౌకర్యాలు మెరుగుపరుస్తున్నాం" అని అజహరుద్దీన్ తెలిపాడు. అజహర్ చెప్పిన టికెట్ల లెక్క 26,550 కాగా.. మిగతావి, దాదాపు 13 వేల టికెట్ల ఏమయ్యాయన్నదే ప్రశ్న.