Ind w Vs Eng w Test :ఇంగ్లాండ్ మహిళలతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత్ 347 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన టీమ్ఇండియా మహిళలు మూడో రోజే మ్యాచ్‌ను ముగించేశారు. భారత్ (428-10, 186-6 d) రెండు ఇన్నింగ్స్‌ల్లో అదరగొట్టి, ప్రత్యర్థి ముందు 484 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కాగా, భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 131 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా బౌలర్లు దీప్తి శర్మ 4, పూజా వస్త్రకార్ 3, రాజేశ్వరీ గైక్వాడ్ 2, రేణుకా ఠాకూర్ 1 వికెట్ పడగొట్టారు. ఇక ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన దీప్తి శర్మకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.
సమష్ఠిగా రాణించిన అమ్మాయిలు :టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ఇండియా అమ్మాయిలు తొలి ఇన్నింగ్స్‌లో, ఇంగ్లాండ్ బౌలర్లను ఓ ఆట ఆడేసుకున్నారు. సుభా సతీశ్ (69), జెమిమా రోడ్రిగ్స్ (68), హర్మన్‌ప్రీత్ కౌర్ (49), యస్తికా భాటియా (66), దీప్తి శర్మ (67) అదరగొట్టారు. చివర్లో స్నేహ్ రానా (30) రాణించింది. దీంతో 104.3 ఓవర్లలో టీమ్ఇండియా 428 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ బౌలర్లలో లారెన్ బెల్ 3, ఎక్లిస్టోన్ 3, చార్లి డీన్, కేట్ క్రాస్, నాట్ సీవర్ తలో వికెట్ పడగొట్టారు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో, 483 పరుగుల ఆధిక్యం లభించిన తర్వాత టీమ్ఇండియా 186-6 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
దీప్తి @9 : స్పిన్‌కు సహకరించిన పిచ్‌పై టీమ్ఇండియా ఆల్‌రౌండర్ దీప్తి శర్మ రెచ్చిపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో 5.3 ఓవర్లలోనే ఏకంగా 5 వికెట్లు నేలకూల్చింది. ఇందులో నాలుగు ఓవర్లను మెయిడెన్లుగా మలిచిందంటే పిచ్ ఎంతలా టర్న్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ 4వికెట్లతో దీప్తి సత్తా చాటింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 9 వికెట్లు పడగొట్టి ఔరా అనిపించింది.