Ind W vs Eng W 3rd T20 :భారత్ - ఇంగ్లాండ్ మహిళల జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ మూడో మ్యాచ్‌లో టీమ్ఇండియా 5 వికెట్ల తేడాతో నెగ్గింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 127 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ స్మృతి మంధాన (48 పరుగులు : 48 బంతుల్లో 5x4, 2x6), జెమీమా రోడ్రిగ్స్ (29 పరుగులు :33 బంతుల్లో 4x4) విజయంలో కీలక పాత్ర పోషించారు. దీంతో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన భారత్, ఆఖరి పోరులో గెలిచి క్లీన్‌స్వీప్ ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఇంగ్లాండ్ బౌలర్లలో సోఫీ ఎకిల్‌స్టోన్ 2, ఫ్రెయా కెంప్ 2, షార్లెట్ డీన్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇంగ్లాండ్ బ్యాటర్లను కట్టడి చేసిన శ్రేయంకా పాటిల్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్', ఇంగ్లాండ్ ప్లేయర్ నాట్ సీవర్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు దక్కింది. ఇక మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లాండ్ 2-1 తేడాతో కైవసం చేసుకొంది.
స్వల్ప లక్ష్య ఛేదనలో టీమ్ఇండియా యంగ్ ఓపెనర్ షఫాలీ వర్మ (6) మరోసారి విఫలమైంది. వన్ డౌన్లో వచ్చిన జెమిమాతో కలిసి స్మృతి జట్టును విజయం వైపు నడిపించింది. వీరిద్దరూ 10 ఓవర్ల వరకూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఇక ఈ జోడీని షార్లెట్ డీన్ విడదీసింది. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (12) క్రీజులో కుదురుకునేలోపే కెంప్ వెనక్కిపంపింది. మరోవైపు హాఫ్ సెంచరీకి చేరువైన మంధాన, 48 వద్ద ఔటైంది. చివర్లో అమన్‌జోత్ కౌర్ (10*) జట్టును విజయతీరాలకు చేర్చింది.