India Vs Westindies 2nd Test : సొంత గడ్డపై విండీస్ సేన విలవిలలాడిపోయింది. కనీస పోటీ అయినా ఇస్తుందని ఆశిస్తే..తొలి టెస్టులోని మూడు రోజుల్లోనే రోహిత్ సేన ముందు పేలవ ప్రదర్శనతో తేలిపోయింది. దీంతో ప్రస్తుతం తమ వద్దనున్న జట్టుతో టెస్టు మ్యాచ్‌లో టీమ్‌ఇండియాను ఓడించే స్థితిలో కూడా లేదు.
మన అరంగేట్ర బ్యాటర్ యశస్వి జైస్వాల్ చేసిన పరుగులను రెండు ఇన్నింగ్స్‌ల్లో ఒక్కసారి కూడా అందుకోలేకపోయిందంటే విండీస్ జట్టు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఇప్పుడు ఇక సిరీస్‌లో చివరి పోరుకు సర్వం సిద్ధమైంది. మరోవైపు భారత్, వెస్టిండీస్ మధ్య ఇది వందో టెస్టు. మరి ఈ ప్రత్యేక మ్యాచ్‌లో అయినా కరీబియన్ జట్టు.. టీమ్ఇండియాకు గట్టి పోటీనిస్తుందా అని అందరూ ఎదరుచూస్తున్నారు.
పోర్ట్ ఆఫ్ స్పెయిన్
ఒక జట్టుతో టీమ్‌ఇండియా వందో టెస్టు ఆడుతోందంటే..ఇక ఆ రెండు జట్ల మధ్య పోరాటానికి ఎంతో ప్రత్యేకత ఉండాలి. అలాగే బరిలోకి దిగిన ప్రత్యర్థికి కూడా ఘన చరిత్ర ఉండాలి. ఒకప్పుడు భారత్, విండీస్ పోరు ఎంతో ప్రత్యేకంగా ఉండేది. ఇక ప్రత్యర్థి చరిత్ర గురించి అందరికీ తెలిసిందే. కానీ గత రెండు మూడు దశాబ్దాల్లో విండీస్ క్రికెట్లో వచ్చిన ప్రమాణాలు.. ఇప్పుడు ఆ జట్టును పాతాళానికి చేర్చాయి. ఇటువంటి స్థితిలో ఆ జట్టుతో ఈ మైలురాయి మ్యాచ్ ఆడాల్సి రావడం ఇరు జట్ల అభిమానులకూ నిరాశ కలిగించే విషయమే.
అయితే ఈ రెండు జట్ల మధ్య ఎంతో వ్యత్యాసం ఉన్నప్పటికీ.. ఈ మ్యాచ్‌కు ఉన్న విశిష్టత దృష్ట్యా అయినా పోరు ఆసక్తికరంగా సాగాలని అందరూ కోరుకుంటున్నారు. ఏకపక్షంగా సాగిన తొలి టెస్టును మూడు రోజుల్లోనే ముగించి.. ఇన్నింగ్స్ విజయం సాధించిన టీమ్‌ఇండియా.. అదే ఊపులో విండీస్‌ను చిత్తు చేసేందుకు సంసిద్ధంగా ఉంది. దీంతో రెండో మ్యాచ్‌లోనూ భారత్ విజయాన్ని ఆపడం విండీస్‌కు కష్టమే కావచ్చు. కాకపోతే ఆ జట్టు ఏమేర పోటీ ఇస్తుందన్నదే చూడాలి.
ఆ మ్యాజిక్ మళ్లీ రిపీటయ్యేనా?
Jaiswal Test Century :తొలి టెస్టులో ఘన విజయాన్ని మూటగట్టుకున్న టీమ్‌ఇండియా ఇప్పట్లో తుది జట్టులో మార్పులు చేసే అవకాశం కనిపించట్లేదు. దీంతో అరంగేట్ర మ్యాచ్‌లో అదరగొట్టిన యువ ఓపెనర్‌యశస్వి జైస్వాల్ మరోసారి రంగంలోకి దిగి అద్భుతాలు సృష్టించేందుకు రెడీగా ఉన్నాడు. అంతర్జాతీయ గడ్డ పై తొలిసారి అడుగుపెట్టినప్పటికీ.. ఏ మాత్రం తడబాటు లేకుండా.. బ్యాటింగ్ చేసి మంచి మార్కులు కొట్టేశాడు.అయితే ఈ సారి మరో పెద్ద ఇన్నింగ్స్ ఇతని ముందుండగా.. తన మెరుపులను మరోసారి ప్రదర్శిస్తాడేమో వేచి చూడాల్సిందే.
జైస్వాల్‌తో పాటు తొలి టెస్టు ఆడిన ఇషాన్ కిషన్‌కు బ్యాటింగ్‌లో ఎక్కువసేపు క్రీజులో నిలిచే అవకాశం రాలేదు. దీంతో ఈ మ్యాచ్‌లో అతణ్ని కాస్త ముందు పంపే అవకాశాలు లేకపోలేదు. అయితే ఇషాన్‌వికెట్ కీపింగ్‌లో మెరుగుపడాల్సి ఉంది. ఎంతో కాలం తర్వాత శతకాన్ని తన ఖాతాలో వేసుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ ఇన్నింగ్స్‌ను జోరుగా కొనసాగించాలని చూస్తున్నాడు. కింగ్ కోహ్లీ కూడా మంచి ఫామ్‌లో కొనసాగుతున్నాడు. అయితే తొలి టెస్టులో విఫలమైన రహానె.. ఈ మ్యాచ్‌లో ఏ మేర ఆడతాడో అని అభిమానులు ఎదురుచూస్తూన్నారు.
అయితే డొమినికాతో పోలిస్తే.. క్వీన్స్ పార్క్ ఓవల్ పిచ్ భిన్నంగా ఉంటుంది. ఈ గడ్డపై పేసర్లు ఎక్కువ ప్రభావం చూపుతారన్న అంచనాలు కూడా ఉన్నాయి. దీంతో మన బ్యాటర్లు.. కీమర్ రోచ్, అల్జారి జోసెఫ్, హోల్డర్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిందే. తొలి టెస్టులో ఆకట్టుకోలేకపోయిన స్పిన్ ఆల్‌రౌండర్ రఖీమ్ కార్న్‌వాల్ స్థానంలో స్పెషలిస్టు సింక్లయిర్ ఆడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పిచ్‌ను బట్టి మరో స్పిన్నర్ వారికన్‌ను తప్పించి.. పేసర్ గాబ్రియల్‌ను ఆడించొచ్చు.
పేసర్లకు పండగే..
తొలి టెస్టులో టీమ్‌ఇండియా గెలుపులో స్పిన్నర్లు అత్యంత కీలక పాత్ర పోషించారు. అశ్విన్ ఏకంగా 12 వికెట్లతో విండీస్‌ను మట్టికరిపించారు. అంతే కాకుండా మరో స్పిన్నర్ జడేజా సైతం తన బౌలింగ్ తీరుతో ఆకట్టుకున్నాడు. దీంతో తొలి టెస్టులో స్పిన్నర్ల జోరు చూసి టీమ్‌ఇండియా ఆడుతోంది వెస్టిండీస్‌లోనా.. లేక సొంతగడ్డపైనా అన్న సందేహాలు కూడా కలిగాయి. ఈ నేపథ్యంలో రెండో టెస్టు పిచ్‌ను పేస్‌కు అనుకూలించేలా సిద్ధం చేస్తారన్న విషయంలో ఏమాత్రం సందేహం లేదు.
Ind Vs WI Test : మరి డొమినికాలో అలా తెరపై కనిపించిన సిరాజ్, శార్దూల్, ఉనద్కత్.. ఈ మ్యాచ్‌లో ఎలాంటి ప్రదర్శన చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో సిరాజ్ మీద మంచి అంచనాలే ఉన్నాయి. అయితే తమకు తుది జట్టులో చోటివ్వడం సమంజసమే అని శార్దూల్, ఉనద్కత్ రుజువు చేయాల్సి ఉంది. తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న విండీస్ కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ పెద్ద ఇన్నింగ్స్ ఆడేందుకు గట్టి ప్రయత్నం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. గత మ్యాచ్‌లో పోరాట పటిమ చూపిన అరంగేట్ర బ్యాటర్ అథనేజ్‌పై జట్టు ఆశలు పెట్టుకుంది.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), శుభ్‌మన్, యశస్వి, కోహ్లీ, రహానె, ఇషాన్ కిషన్, జడేజా, అశ్విన్, శార్దూల్,సిరాజ్, ఉనద్కత్.
వెస్టిండీస్: క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), కిర్క్ మెకంజీ, అథనేజ్, బ్లాక్‌వుడ్, కీమర్ రోచ్, త్యాగ్‌నారాయణ్, హోల్డర్, జాషువా ద సిల్వా, రఖీమ్ కార్న్‌వాల్/సింక్లయిర్, అల్జారి జోసెఫ్, గాబ్రియల్/వారికన్.