Ind Vs Wi T20 : వెస్టిండీస్‌తో మొదటి టీ20లో భారత్ 4 పరుగుల తేడాతో ఓడింది. 149 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ చతికిలపడింది. ఛేదనలో ఓవర్లన్నీ ఆడిన టీమ్ఇండియా 9 వికెట్లకు 145 పరుగులే చేయగలిగింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (39 పరుగులు: 22 బంతుల్లో 2x4, 3x6) ఒక్కడు తప్ప.. మిగతావారెవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. విండీస్ బౌలర్లలో జేసన్ హోల్డర్ 2, మెకాయ్ 2, షెపర్డ్ 2, హోసీన్ 1 వికెట్ పడగొట్టారు. రెండు కీలక వికెట్లు తీసిన విండీస్ బౌలర్ హోల్డర్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్‌లో ఆతిథ్య వెస్టిండీస్ 1-0 తో లీడ్‌లో కొనసాగుతోంది.
ఆరంభమే పేలవంగా..
లక్ష్యం చిన్నదే అయినా.. టీమ్ఇండియా ఆదినుంచే తడబడింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్లలోనే ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (3) స్టంపౌడ్గా పెవిలియన్ చేరాడు. ఈ సిరీస్‌లో పరిమిత ఓవర్ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ కూడా (6) త్వరగానే నిష్క్రమించాడు. ఇక వన్ డౌన్లో వచ్చిన సూర్య (21).. తిలక్ వర్మతో జత కట్టాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే తిలక్ తనదైన శైలిలో బౌండరీలు బాదుతూ.. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అద్భుతమైన సిక్సర్‌తో ఖాతా తెరిచిన అతడు.. విండీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. దీంతో భారత్ విజయం దాదాపు ఖాయం అనుకున్న సమయంలో.. బ్యాక్ టు బ్యాక్ ఓవర్లలో సూర్య, తిలక్ ఔటయ్యారు.
ఇక 15 ఓవర్లకు భారత్ 113/4 తో నిలిచింది. అప్పటికి టీమ్ఇండియా విజయానికి 30 బంతుల్లో 37 పరుగులు కావాలి. క్రీజులో కెప్టెన్ హార్దిక్ పాండ్య (19), సంజూ శాంసన్(12)లు ఉండడం వల్ల భారత్ విజయం కష్టం కాదనుకున్నారంతా. కానీ కీలక సమయంలో హర్దిక్‌ను, హోల్డర్ వెనక్కుపంపగా.. శాంసన్ రనౌటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన అక్షర్ పటేల్ (13) కూడా ప్రభావం చూపలేదు. భారత్ క్రమక్రమంగా వికెట్లు కోల్పోయి విజయానికి 5 పరుగుల దూరంలో ఇన్నింగ్స్‌ను ముగించింది.
అంతకుముందు టాస్ గెలిచిన విండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లు ప్రత్యర్థి బ్యాటర్లను మొదటి నుంచే కట్టడి చేశారు. ఈ పర్యటనలో తొలి మ్యాచ్ ఆడిన యుజ్వేంద్ర చాహల్.. మేయర్స్‌ను ఔట్ చేసి భారత్‌కు మొదటి బ్రేక్ ఇచ్చాడు. ధాటిగా మరో ఓపెనర్ బ్రండన్ కింగ్ (28)ను కూడా చాహలే పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత చార్లెస్ (3) ప్రభావం చూపలేకపోయినా.. వికెట్ కీపర్ పూరన్ (41), కెప్టెన్ రోమన్ పావెల్ (48) రాణించడం వల్ల విండీస్ గౌరప్రదమైన స్కోర్ సాధించగలిగింది. భారత బౌలర్లలో చాహల్ 2, అర్షదీప్ 2, హార్దిక్, కుల్దీప్ తలో వికెట్ పడగొట్టారు. కాగా ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆదివారం జరగనుంది.
ఈ మ్యాచ్‌లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ, ఫాస్ట్ బౌలర్ ముకేశ్ కుమార్ అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. మ్యాచ్‌కు ముందు తిలక్.. కెప్టెన్ హార్దిక్ చేతులమీదుగా క్యాప్ అందుకున్నాడు. కాగా బౌలర్ ముకేశ్‌కు.. స్పిన్నర్ చాహల్ క్యాప్ అందజేశాడు.