IND vs WI T20: టీమ్‌ఇండియా వెస్టిండీస్ పర్యటన చివరి అంకానికి చేరింది. శని, ఆదివారాలు ఆఖరి రెండు టీ20లను అమెరికాలోని ఫ్లోరిడాలో ఆడనుంది. ఇప్పటికే భారత జట్టు కరీబియన్ గడ్డపై 3-0తో వన్డే సిరీస్ కైవసం చేసుకోగా పొట్టి ఫార్మాట్‌లోనూ 2-1 ఆధిక్యంలో నిలిచింది. మిగిలిన రెండు టీ20ల్లో ఏ ఒక్కటి విజయం సాధించినా ఈ సిరీస్‌ను కూడా సొంతం చేసుకోనుంది. అయితే, ఇప్పుడు అందరి దృష్టి భారత బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్‌పైనే నెలకొని ఉంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన అతడు (0 , 10 , 24) పూర్తిగా విఫలమయ్యాడు.
అలాగే గత రెండున్నర నెలల్లో టీమ్‌ఇండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ అతడికి మొత్తం 9 అవకాశాలిచ్చినా ఒక్కదాంట్లోనూ కనీసం అర్ధ శతకం సాధించలేదు. దీంతో ఇప్పుడు అతడిపైనే ఎక్కువ దృష్టి సారించనున్నారు. శ్రేయస్ ప్రస్తుతం షార్ట్‌పిచ్ బంతులతో ఇబ్బందులు పడుతున్నాడు. ఈ విషయం విండీస్ పర్యటనలో మరోసారి రుజువైంది. అంతకుముందు ఇంగ్లాండ్ పర్యటనలోనూ అతడు ఇలాంటి బంతులకే ఔటయ్యాడు. మరోవైపు త్వరలో జరగబోయే ఆసియా కప్ టోర్నీలో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ తిరిగి జట్టులో చేరే అవకాశం ఉండటంతో శ్రేయస్‌కు పోటీ తీవ్రం కానుంది.