తెలంగాణ

telangana

ETV Bharat / sports

వైట్​వాష్​పై టీమ్​ఇండియా కన్ను.. కుర్రాళ్లకు అవకాశం! - క్రీడా వార్తలు

IND vs WI ODI 2022: తొలి రెండు వన్డేల్లో అద్భుతమైన ప్రదర్శనతో విండీస్​పై ఘన విజయం సాధించిన టీమ్​ఇండియా.. వైట్​వాష్​పై కన్నేసింది. కరోనాతో దూరమైన ధావన్​.. ఈ వన్డేతో తిరిగి జట్టులోకి రానున్నాడు. ఈ నేపథ్యంలో ఆఖరి మ్యాచులోనైనా విండీస్​ రాణిస్తుందా లేక టీమ్​ఇండియా ఆధిపత్యం కొనసాగిస్తుందా అని అభిమానుల్లో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ind vs wi
టీమ్​ఇండియా

By

Published : Feb 10, 2022, 6:24 PM IST

Updated : Feb 10, 2022, 7:48 PM IST

IND vs WI ODI 2022: తొలి రెండు వన్డేల్లో ఘన విజయం సాధించిన టీమ్ఇండియా మంచి జోష్‌ మీద ఉంది. మూడో మ్యాచులోనూ అదే ఊపును కొనసాగించి వన్డే సిరీస్‌ను వైట్ వాష్‌ చేయాలని చూస్తోంది. మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే 2-0 ఆధిక్యంలో కొనసాగుతున్న భారత జట్టు.. శుక్రవారం (ఫిబ్రవరి 11న) జరుగనున్న నామమాత్రపు మూడో వన్డేలో ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. పూర్తి స్థాయి వన్డే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాక రోహిత్‌ శర్మ సాధించిన తొలి సిరీస్‌ ఇదే. మరో వైపు, పేలవ ప్రదర్శనతో సిరీస్‌ కోల్పోయిన వెస్టిండీస్‌ జట్టు మూడో వన్డేలోనైనా పుంజుకుంటుందేమో చూడాలి.!

కరోనా కారణంగా తొలి రెండు వన్డేలకు దూరమైన ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌.. కోలుకుని తిరిగి జట్టులోకి రావడం భారత్‌కు సానుకూలాంశం. మూడో వన్డేలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో కలిసి అతడు ఓపెనింగ్‌ చేయనున్నాడు. గత నెలలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో ధావన్‌ కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. అదే ఫామ్‌ను వెస్టిండీస్‌పై కొనసాగించాలని చూస్తున్నాడు. అతడి స్థానంలో తొలి వన్డేలో ఇశాన్‌ కిషన్‌, రెండో వన్డేలో రిషభ్‌ పంత్‌ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. మూడో వన్డేకి శిఖర్‌ ధావన్‌ అందుబాటులోకి రావడం వల్ల కేఎల్ రాహుల్‌ మిడిలార్డర్‌లోనే బరిలోకి దిగనున్నాడు. విరాట్‌ కోహ్లీ, రిషభ్‌ పంత్‌, సూర్యకుమార్‌ యాదవ్‌లతో మిడిలార్డర్‌ బలంగా కనిపిస్తోంది. గత వన్డేలో స్వల్ప వ్యవధిలోనే కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమ్ఇండియాను సూర్యకుమార్‌ (64) అద్భుత ఇన్నింగ్స్‌తో ఆదుకున్న విషయం తెలిసిందే. ధావన్‌ రాకతో యువ ఆల్ రౌండర్ దీపక్ హుడాను పక్కన పెట్టే అవకాశం ఉంది. శ్రేయస్‌ అయ్యర్‌ని తుదిజట్టులోకి తీసుకునే విషయంలో స్సష్టత రావాల్సి ఉంది.

కుర్రాళ్లకు ఓ అవకాశం.!

మూడు వన్డేల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో కొనసాగుతున్న భారత జట్టు మూడో వన్డేలో ప్రయోగాలు చేయనుంది. గాయం నుంచి కోలుకుని పునరాగమనం కోసం ఎదురు చూస్తున్న లెగ్‌ స్పిన్నర్ కుల్దీప్‌ యాదవ్ లేదా యువ ఆటగాడు రవి బిష్ణోయ్‌లలో ఒకరికి చోటు దక్కొచ్చు. దీంతో యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్‌లలో ఒకరికి విశ్రాంతినివ్వనున్నారు. అలాగే, యువ పేసర్‌ అవేశ్‌ ఖాన్‌ భారత జట్టులోకి అరంగేట్రం చేసేందుకు ఎదురు చూస్తున్నాడు. ఒక వేళ అవేశ్‌ ఖాన్‌కి అవకాశం ఇస్తే.. మహమ్మద్ సిరాజ్‌ను పక్కన పెట్టక తప్పదు. ఈ సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్‌లు అలాగే కొనసాగనున్నారు. ఈ సిరీస్‌లో విండీస్‌ జట్టును స్వల్ప స్కోర్లకే ఆలౌట్ చేయడంలో భారత బౌలర్లు కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. తొలి వన్లేలో 176, రెండో మ్యాచులో 193 పరుగులకు విండీస్‌ను ఆలౌట్ చేశారు.

ఆఖరి మ్యాచులోనైనా విండీస్‌ రాణిస్తుందా?

ఇప్పటికే పేలవ ప్రదర్శనతో వన్డే సిరీస్‌ను కోల్పోయిన వెస్టిండీస్‌ జట్టు మూడో మ్యాచులోనైనా రాణించి పరువు కాపాడుకోవాలని చూస్తోంది. కెప్టెన్ కీరన్ పొలార్డ్, ఆల్ రౌండర్ జేసన్‌ హోల్డర్‌ తమ పాత్రలకు న్యాయం చేయాల్సి ఉంది. వీరితో పాటు షాయ్‌ హోప్‌, బ్రెండన్‌ కింగ్, నికోలస్‌ పూరన్‌ అంచనాలకు తగ్గట్టుగా రాణించాల్సిన అవసరం ఉంది. విండీస్‌ బౌలింగ్‌ కాస్త మెరుగ్గానే కనిపిస్తోంది. పేసర్లు కీమర్‌ రోచ్‌, అల్జారీ జోసెఫ్‌, ఓడీన్‌ స్మిత్‌ సరైన లెంగ్త్‌లో బంతులేస్తూ వికెట్లు సాధించారు. స్పిన్నర్లు ఫేబియన్‌ అలెన్‌, అకీల్ హోసెయిన్‌ కూడా భారత్‌ని కట్టడి చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు. చివరి వన్డేలోనూ ఇదే ప్రదర్శనను కొనసాగించాలని విండీస్‌ జట్టు భావిస్తోంది. విండీస్‌ జట్టు ఆడిన గత 17 వన్డేల్లో.. 50 ఓవర్లలోపే ఆలౌట్ కావడం ఇది 11వ సారి కావటం గమనార్హం.

తుది జట్ల అంచనా:

భారత్‌ : రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్, రిషభ్‌ పంత్‌, సూర్యకుమార్ యాదవ్‌, శార్దూల్ ఠాకూర్‌, యుజ్వేంద్ర చాహల్‌/వాషింగ్టన్‌ సుందర్‌, కుల్దీప్‌ యాదవ్/రవి బిష్ణోయ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ, మహమ్మద్ సిరాజ్‌/అవేశ్ ఖాన్‌

వెస్టిండీస్ : కీరన్ పొలార్డ్‌ (కెప్టెన్‌), ఫేబియన్‌ అలెన్‌, షమార్‌ బ్రూక్స్‌, జేసన్‌ హోల్డర్‌, షాయ్‌ హోప్‌, అకీల్ హోసెయిన్‌, అల్జారీ జోసెఫ్‌, బ్రెండన్‌ కింగ్, నికోలస్‌ పూరన్‌, కీమర్‌ రోచ్‌, ఓడీన్‌ స్మిత్

ఇదీ చూడండి :రంజీ ట్రోఫీలో యష్​ ధుల్​.. ఏ జట్టుకు ఆడనున్నాడంటే?

Last Updated : Feb 10, 2022, 7:48 PM IST

ABOUT THE AUTHOR

...view details