IND vs WI 5th T20: వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ అదరగొట్టింది. ఐదో టీ20 మ్యాచ్‌లో ప్రత్యర్థి విండీస్‌ను చిత్తుచిత్తుగా ఓడించి సిరీస్‌ను 4-1 తేడాతో చేజిక్కించుకుంది. శ్రేయస్ అయ్యర్ (64; 40 బంతుల్లో 8×4,2×6) మెరుపు ఇన్నింగ్స్‌కు బౌలర్ల సమష్టి కృషి తోడవ్వడంతో ఫ్లోరిడా వేదికగా జరిగిన నామమాత్రపు ఐదో మ్యాచ్‌లో 88 పరుగుల భారీ తేడాతో విజయదుందుభి మోగించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేయగా.. లక్ష్యఛేదనకు దిగిన విండీస్ జట్టు 100 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ 4 వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు తీశారు.
తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ పక్కా ప్రణాళికతో ఆడింది. ఓపెనర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (11) నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించారు. కానీ, డోమినిక్ డ్రేక్స్ వేసిన 4.3వ బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన ఇషాన్.. పూరన్ చేతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన దీపక్ హుడా (38)తో కలిసి శ్రేయస్ స్కోరుబోర్డును పరుగులెత్తించాడు. కానీ, హేడెన్ వాల్ష్ బౌలింగ్‌లో బ్రూక్స్ చేతికి చిక్కి దీపక్ వెనుదిరిగాడు. కొద్ది సేపటికే జట్టు స్కోరు 122 పరుగులు వద్ద శ్రేయస్ కాట్ అండ్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శాంసన్ (15), హార్దిక్ పాండ్య (28), కార్తిక్ (12), అక్షర్ పటేల్ (9), ఆవేశ్‌ఖాన్ (1 నాటౌట్) పరుగులు చేశారు.