Ind vs Wi 4th T20 :టీమ్ఇండియా అదరగొట్టింది. విండీస్‌పై వరుసగా రెండో విజయం నమోదు చేసింది. శనివారం జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో తొమ్మిది వికెట్ల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. 179 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఒక వికెట్ కోల్పోయి 17 ఓవర్లలోనే ఛేదించింది. టీమ్ఇండియా యంగ్ బ్యాటర్లు యశస్వి జైశ్వాల్(84 పరుగులు, 11x4, 3x6), శుభ్‌మన్ గిల్ (77 పరుగులు, 3x4, 5x6) రాణించారు. విండీస్ బౌలర్లలో షెపర్డ్ ఒక వికెట్ (1/35) దక్కింది. తుపాన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న జైశ్వాల్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.
ఆరంభం ఘనంగా.. ఓ మోస్తారు లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌కు అద్భుతమైన ఆరంభం లభించింది. ఓపెనర్లు గిల్, జైశ్వాల్.. ప్రత్యర్థి బౌలర్లకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఇక గత మ్యాచ్‌ల్లో ఘోరంగా విఫలమైన శుభ్‌మన్ గిల్ మళ్లీ తన ఫామ్ అందుకున్నాడు. ఓపెనర్లు ఇద్దరూ తొలి వికెట్‌కు 15.3 ఓవర్లలోనే 165 భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత కావాల్సిన పరుగులు తక్కువే ఉండటం వల్ల.. వన్ డౌన్లో వచ్చిన తిలక్ వర్మ (7 పరుగులు నాటౌట్) తో కలిసి జైశ్వాల్ మిగిలిన పనిని పూర్తి చేశాడు.