Ind Vs Wi 3rd T20 Hardik Pandya : వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో టీమ్ఇండియా అదరగొట్టింది. గయానా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. కానీ ఈ విజయం తర్వాత టీమ్ఇండియా తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అతడి వల్ల తెలుగు తేజం తిలక్ వర్మ.. హాఫ్ సెంచరీ సాధించలేకపోయాడని ఆరోపిస్తున్నారు. అసలేం జరిగిందంటే?
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్‌ను భారత బౌలర్లు కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. అయితే చివర్లో విండీస్ కెప్టెన్ రావ్‌మెన్ పావెల్ (19 బంతుల్లో 40 నాటౌట్) చెలరేగడంతో ఆ టీం 159 పరుగుల స్కోరు చేసింది. కొంచెం స్లోగా ఉండి, స్పిన్‌కు సహకరిస్తున్న పిచ్‌పై ఇది టఫ్ టార్గెట్ అనే చెప్పాలి. ఈ ఛేదనలో భారత్‌కు సరైన ఆరంభం దక్కలేదు. అరంగేట్ర ఆటగాడు యశస్వి జైస్వాల్ కేవలం ఒక్క పరుగే చేసి పెవిలియన్ చేరాడు. ఇక రాణిస్తాడని అనుకున్న శుభ్‌మన్ గిల్ (6) కూడా విఫలమయ్యాడు. ఇలాంటి సమయంలో సూర్యకుమార్ యాదవ్ (83), తిలక్ వర్మ (49 నాటౌట్) కీలకమైన భాగస్వామ్యం నెలకొల్పారు.
Ind Vs Wi 3rd T20 Tilak Varma Innings : అయితే సూర్య పెవిలియన్ చేరిన తర్వాత తిలక్ తన ఇన్నింగ్స్ వేగం పెంచాడు. దీంతో అతడు వరుసగా రెండో హాఫ్ సెంచరీ నమోదు చేస్తాడని ఫ్యాన్స్ అనుకున్నారు. చివర్లో విండీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారీ షాట్లు ఆడటం కష్టంగా మారింది. దీంతో అతడు సింగిల్స్, డబుల్స్‌పై ఆధార పడ్డాడు. అయితే సూర్య అవుటైన తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్య మాత్రం భారీ షాట్‌తో ఇన్నింగ్స్ ముగించడానికి పలుసార్లు ప్రయత్నించాడు. ఇది చూసిన ఫ్యాన్స్ మండిపడ్డారు. మపో ఎండ్‌లో తిలక్ 45+ స్కోరుతో ఉన్నాడని, విజయం కూడా ఖాయమైందని ఇలాంటి టైంలో పాండ్య ఇలా చేయడం ఎందుకని ప్రశ్నించారు.