IND Vs WI 3rd ODI : వెస్టిండీస్ జట్టుతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమ్‌ఇండియా 2-1తో కైవసం చేసుకుంది. మూడో వన్డేలో ఏకంగా 200 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి అదరగొట్టింది. విండీస్‌పై వరుసగా 13వ సారి వన్డే సిరీస్ గెలుచుకుంది. అయితే ఈసారి వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు సాధించిన ఇషాన్ కిషన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నారు. మూడో వన్డేలో రాణించిన శుభ్‌మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. వీరితో పాటు కెప్టెన్ హార్దిక్ పాండ్య.. వీరబాదుడు బాదేశాడు. అయితే మ్యాచ్ అనంతరం సిరీస్‌ను గెలవడంపై హార్దిక్ పాండ్య మాట్లాడాడు.
"వెస్డిండీస్‌తో జరిగిన సిరీస్‌లో విజయం ఎంతో ప్రత్యేకమైంది. గత వన్డేలో ఓడిపోయిన తర్వాత మా మీద ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇలాంటి సమయంలో ఒత్తిడిని ఎదుర్కొని మరీ మన కుర్రాళ్లు అదరగొట్టారు. కెప్టెన్‌గా ఇలాంటి మ్యాచ్‌ను నడిపించడం ఆనందంగా ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఓడిపోయి ఉంటే ఏం జరిగేదో నాకు తెలుసు. చాలా నిరుత్సాహానికి గురయ్యేవాళ్లం. కానీ.. మా ప్లేయర్లు గొప్పగా పోరాడారు. సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకపోయినా ఒత్తిడిని తట్టుకొని మరీ రాణించారు. విరాట్, రోహిత్ మా జట్టులో ఎప్పుడూ భాగమే. అయితే, కీలకమైన టోర్నీల ముంగిట విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకే రుతురాజ్‌కు అవకాశం వచ్చింది"
-- హార్దిక్ పాండ్య, టీమ్‌ఇండియా తాత్కాలిక కెప్టెన్
IND Vs WI 3rd ODI Hardik Pandya : "నేను కూడా మొదట్లో క్రీజ్‌లో కుదురుకునేందుకు సమయం తీసుకున్నా. మూడో వన్డే మ్యాచ్ ప్రారంభానికి ముందు విరాట్ కోహ్లీతో జరిపిన సంభాషణ ఎంతో ఉపయోగపడింది. క్రీజ్‌లో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించమని విరాట్ సూచించాడు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో పరుగులు చేయాలంటే అదొక ఉత్తమ మార్గం. ఈ మ్యాచ్‌లో విరాట్ సూచనలతోనే ఆడేందుకు ప్రయత్నించి సఫలమయ్యా. దానికి కోహ్లీకి ధన్యవాదాలు చెప్పకుండా ఉండలేను. ఇలాంటి పిచ్‌పై భారీ స్కోరు సాధించడం సాధారణ విషయం కాదు. అలాంటి లక్ష్యం ఉన్నప్పుడు ప్రత్యర్థి బ్యాటర్లు ఒత్తిడికి గురవుతారు. బంతిని బాదేందుకు ప్రయత్నించి ఔటవుతారు. శుభ్‌మన్ గిల్ అద్భుతమైన క్యాచ్‌లను అందుకున్నాడు. ట్రినిడాడ్ వేదిక చాలా అద్భుతంగా ఉంది. అయితే, సదుపాయాలు ఇంకాస్త మెరుగ్గా ఉంటే బాగుండేది. మేం లగ్జరీని కోరుకోవడం లేదు. ఈసారి విండీస్ పర్యటనకు వచ్చే సమయానికి ఇలాంటి సమస్యలు ఉండవని భావిస్తున్నా’’ అని పాండ్య వెల్లడించాడు. కెప్టెన్సీని తాను చేపట్టినా ట్రోఫీ మాత్రం రోహిత్‌కే చెందుతుంది" అని హార్దిక్ సరదాగా వ్యాఖ్యానించాడు.
ముకేశ్ అదుర్స్..
IND Vs WI 3rd ODI Mukesh Kumar : టీమ్‌ఇండియా బౌలర్ ముకేశ్ కుమార్ తనకొచ్చిన అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నాడు. వెస్టిండీస్‌తో మూడో వన్డేలో కీలకమైన వికెట్లు పడగొట్టాడు. ఓపెనర్లు బ్రాండన్ కింగ్, కేల్ మేయర్స్‌తోపాటు కెప్టెన్ షై హోప్‌ను ఔట్ చేశాడు. అందులోనూ డేంజరస్ బ్యాటర్ కేల్ మేయర్స్‌ను బౌల్డ్ చేయడం విశేషం. ఈ మ్యాచ్‌లో ముకేశ్ ఏడు ఓవర్లు వేసి 30 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ముకేశ్ వికెట్లు తీసిన వీడియోను మీరూ చూసేయండి..