ind vs wi 2023 second test: ఎప్పుడు కాస్త రక్షణాత్మక ధోరణిలో ఆడే టీమ్ఇండియా.. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో మాత్రం దూకుడుగా ఆడుతోంది. మనోళ్లు వేగంగా పరుగులు చేసి ప్రత్యర్థి జట్టు ముందు 365 భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. అలానే బౌలర్లు కూడా వికెట్లను ఫటా ఫట్ తీస్తున్నారు. అలా నాలుగో రోజు ఆట పూర్తయ్యేసమయానికి విండీస్ జట్టు 76/2 స్కోరుతో క్రీడులో నిలిచింది. అశ్విన్ రెండు వికెట్లు పడగొట్టి జోష్ మీదున్నాడు. అయితే చివరి రోజు వర్షం వల్ల ఎటువంటి అంతరాయం కలగకుండా ఉంటే.. దాదాపుగా మనోళ్లదే విజయం అవుతుంది.
బజ్‌బాల్ ఆడేశారు.. వెస్టిండీస్‌ను మొదటి ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌట్ చేశారు. అయితే ఇందులో సిరాజ్ (5/60) ప్రధాన పాత్ర పోషించాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో మన బ్యాటర్లు 24 ఓవర్లలోనే 181 పరుగులు చేసి డిక్లెర్ ఇచ్చేశారు. 'బజ్‌బాల్' క్రికెట్ ఆడి ఈ పరుగులు చేశారు. ఈ మధ్య కాలంలో ఇంగ్లాండ్ జట్టు మాత్రమే ఇలా ఆడుతోంది. ఇప్పుడు మనోళ్లు యశస్వి జైస్వాల్ (30 బంతుల్లో 38; 4x4, 1x6), రోహిత్ (44 బంతుల్లో 57; 5x4, 3x6), శుభ్‌మన్ గిల్ (37 బంతుల్లో 29*; 1x4), ఇషాన్ కిషన్ (34 బంతుల్లో 52*; 4 x4, 2x6) కూడా దూకుడుగా ఆడి ఆకట్టుకున్నారు. సుమారు 7.54 రన్‌రేట్‌తో పరుగులు చేశారు.
తొలి సెషన్ కీలకం.. 76/2 స్కోరుతో ఉన్న వెస్టిండీస్‌కు ఇంకా 289 పరుగులు అవసరం. అలాగే భారత్‌కు 8 వికెట్లు అవసరం. అశ్విన్- సిరాజ్ మంచి ఫామ్‌లో ఉన్నారు. కాబట్టి ఐదో రోజు ఆటలో మొదటి సెషన్ చాలా కీలకం. ఈ సెషన్లో వీలైనంత త్వరగా వికెట్లు తీస్తే.. ప్రత్యర్థి జట్టును ఓడించే అవకాశాలు టీమ్ఇండియాకు చాలా ఎక్కువగా ఉంటాయి.