ind vs wi 2023 Ashwin wickets : డొమినికా వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. మనోళ్లు పట్టు బిగించారు. విండీస్‌ను 150 పరుగులకే ఆలౌట్ చేశారు. ఇందులో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రధాన పాత్ర పోషించాడు. తన బౌలింగ్‌తో మాయచేస్తూ ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాడు. 24.3 ఓవర్లలో 60 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లను దక్కించుకున్నాడు. అలాగే.. క్రీజులో కుదురుకున్న యువ బ్యాటర్ త్యాగ్‌నారాయణ్ చంద్రపాల్ వికెట్‌ను పడగొట్టాడు. ఇది ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. అయితే తన ప్రదర్శనపై అశ్విన్ స్పందించాడు.
"విదేశీ గడ్డపై మరోసారి అద్భుతంగా రాణించడం ఎంతో సంతోషంగా ఉంది. గేమ్ ప్రారంభంలో పిచ్‌పై కాస్త తేమ ఉంది. అయితే.. మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే బంతి స్వింగ్ అవ్వడం ప్రారంభమైంది. మ్యాచ్ ముందుకు సాగుతున్న కొద్దీ స్పిన్‌కు బాగా అనుకూలించింది. పేస్ బౌలింగ్ కూడా బ్యాటర్లను బాగా ఇబ్బంది పెట్టింది. ఇండర్నేషనల్ క్రికెట్‌లో పిచ్‌ను వీలైనంత వేగంగా అర్థం చేసుకోవాలి. అందుకు తగ్గట్టుగా బౌలింగ్ చేయాలి. అప్పుడు రిజల్ట్ అనుకూలంగా వస్తుంది. ఇక యంగ్ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ అద్భుతంగా ఆడుతున్నాడు. అతడికి మంచి టాలెంట్ ఉంది. భవిష్యత్తులో గొప్ప స్థానానికి చేరొచ్చు. అందుకే అతడి నుంచి మంచి ప్రదర్శనను ఆశిస్తున్నాం" అని అశ్విన్ పేర్కొన్నాడు.
తండ్రీకొడుకులిద్దరినీ.. మొదటి రోజు ఆటలో సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో తండ్రీకొడుకులిద్దరినీ ఔట్ చేసిన ఐదో బౌలర్‌గా మార్క్ అందుకున్నాడు. అలాగే భారత్ తరఫున తొలి బౌలర్‌గా నిలిచాడు. తొలి రోజు ఆటలో క్రీజులు కుదుర్కున్న త్యాగ్‌నారాయణ్ చందర్‌పాల్‌ను బౌల్డ్ చేసి ఈ ఘనత సాధించాడు. 2011లో దిల్లీ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన అశ్విన్.. ఆ మ్యాచ్‌లో త్యాగ్‌నారాయణ్ తండ్రి శివ్‌నారాయణ్ చందర్‌పాల్‌నే ఔట్ చేయడం విశేషం. అప్పుడు అశ్విన్ బౌలింగ్‌లో శివన్ నారాయణ్ చందర్‌పాల్‌ను ఎల్బీగా వెనుదిరిగాడు. ఇకపోతే మిచెల్ స్టార్క్(ఆస్ట్రేలియా), సిమోన్ హార్మర్ (దక్షిణాఫ్రికా) కూడా త్యాగ్‌నారాయణ్, అతడి తండ్రి శివ్‌నారాయణ్‌లను ఔట్ చేశారు.