IND vs WI Kohli : వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శతకంతో అదరగొట్టాడు టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (121). ఇది అతడికి 500వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం ఓ విశేషమైతే.. ఇదే మ్యాచ్‌లో అతడు సెంచరీ బాదడం మరో విశేషం. టెస్టు కెరీర్‌లో అతడికిది 29వ శతకం. లాస్ట్ టైమ్ విదేశీ గదడ్డపై 2018 డిసెంబర్‌లో ఆస్ట్రేలియాపై సెంచరీ బాదాడు. మళ్లీ ఇప్పుడు కొట్టాడు. అయితే దీనిపై విరాట్ మాట్లాడాడు. ఫారెన్‌లో తన రికార్డేమీ పేలవంగా లేదని, పదిహేను సెంచరీలు బాదినట్లు గుర్తుచేశాడు. క్వీన్స్ పార్క్ ఓవల్ పిచ్ చాలా నెమ్మదిగా ఉందని చెప్పుకొచ్చాడు.
kohli test centuries : "నేను ఎలా అయితే ఆడాలని అనుకున్నానో.. అదే లయతో బ్యాటింగ్ చేశాను. ఎంత ఒత్తిడి సమయంలోనూ టీమ్ కోసం నిలబడేందుకు రెడీగా ఉంటాను. నిరంతరం నాలో నేను ఎప్పుడూ పోటీ పడుతూనే ఉంటాను. నాలోని అత్యుత్తమ ఆటతీరును బయటకు తీసేందుకు ట్రై చేస్తాను. వెస్టిండీస్ బౌలర్లు మంచి బౌలింగ్ వేయడంతో నిదానంగా ఆడాల్సి వచ్చింది. ట్రినిడాడ్ పిచ్ కూడా చాలా స్లోగా ఉంది. ఔట్‌ఫీల్డ్ కూడా అంత గొప్పగా లేదు. దీంతో మంచి షాట్లు బాదినా బౌండరీలు పోలేదు. దాదాపు ఐదేళ్ల తర్వాత శతకం బాదానని అంటున్నారు. అది వాళ్లు మాట్లాడుకోవడానికి మాత్రమే బాగుంటుంది. కానీ నేను విదేశాల్లో 15 శతకాలు చేశాను. అదేమీ అంత చెత్త రికార్డు కాదు. సొంత గడ్డపై కన్నా బయటే ఎక్కువ శతకాలు బాదాను. ఈ నాలుగున్నరేళ్లలో విదేశాల్లో ఎక్కువగా మ్యాచ్‌లు ఆడలేదు. అయితే ఇక్కడ హాఫ్ సెంచరీలు బాదను. టీమ్ కోసం నా వంతు సహకారం అందించడానికి ఎప్పుడూ రెడీగానే ఉంటాను. ఏదైనా మ్యాచ్‌లో హాఫ్ సెంచరీకిపైగా పరుగులు చేసి ఔటైతే.. శతకం మిస్ అయిందని బాధపడతాను. అలాగే 120కుపైగా పరుగులు చేసి ఔటైతే ద్విశతకం మిస్ అయిందని భావిస్తాను. గత పదిహేనేళ్లలో నా కెరీర్‌లో ఇలాంటి రికార్డ్స్‌ను, మైలురాళ్లను చాలా చూశాను. ఆ ప్రదర్శన టీమ్‌పై ప్రభావం చూపిందా...? లేదా..? అనేది నాకు ఎంతో ముఖ్యం" అని కోహ్లీ అన్నాడు.
టీమ్‌ఇండియా తరఫున ఇంటర్నేషనల్ కెరీర్‌లో 500 మ్యాచ్‌లు ఆడటం ఎంతో గర్వంగా ఉంది. రిజల్ట్ ఎలా ఉన్నా.. ఆట పట్ల నేను చూపించే దృక్పథం వల్లే ఈ మైలురాయిని సాధ్యమైందని భావిస్తాను. అన్ని ఫార్మాట్లలోనూ ఆడగల దమ్ము నాకు ఉంది. త్వరగా ఒక ఫార్మాట్ ఆడి.. మళ్లీ మరో ఫార్మాట్‌కు తగ్గట్టు మారిపోగలను. నా ఫిట్‌నెస్ వల్లే ఇదంతా చేయగలుగుతున్నాను. వెస్టిండీస్ వందో టెస్టులో ఆడటం ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడి వారు క్రికెట్‌ను ఎంతో అభిమానిస్తారు. ఇప్పుడు ఆడుతున్న ట్రినిడాడ్ పిచ్‌తోపాటు అటింగ్వా స్టేడియం నాకెంతో ఇష్టం. అలాగే ఆసీస్‌లో అడిలైడ్, దక్షిణాఫ్రికాలో బుల్‌రింగ్ పిచ్ కూడా ఎంతో ఇష్టం. అక్కడ ఆడటానికి ఎంతో ఇష్టపడతాను" అని కోహ్లీ పేర్కొన్నాడు.