IND VS WI 2023 Kohli Century : టీమ్ఇండియాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్ ప్రతిఘటిస్తోంది. రెండో రోజు ఆట పూర్తయ్యే సమయానికి 86/1 స్కోరుతో నిలిచింది. క్రెయిగ్ బ్రాత్‌వైట్ (37*), మెకంజీ(14*) క్రీజులో కొనసాగుతున్నారు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ ఇంకా 352 పరుగుల వెనుకంజలో ఉంది.
ఓవర్ నైట్ స్కోరు 288/4తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమ్ఇండియా.. మొదటి ఇన్నింగ్స్‌లో 438 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇక భారత్ జట్టు ఆలౌట్ అయిన తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ జట్టుకు ఓపెనర్లు బ్రాత్‌వైట్, త్యాగ్‌నారాయణ్ చందర్‌పాల్ (33) మంచి శుభారంభం అందించారు. బ్రాత్‌వైట్ నిలకడగా ఆటను కొనసాగించాడు. అయితే మొదట స్లోగా ఆడిన త్యాగ్‌నారాయణ్.. ఆ తర్వాత బౌండరీలు ధనాధన్ బాదాడు. అశ్విన్ వేసిన బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదిన అతడు.. సిరాజ్ బౌలింగ్‌లోనూ బాల్‌ను రెండుసార్లు బౌండరీ దాటించాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే జడేజా బౌలింగ్‌లో అశ్విన్ చేతికి చిక్కాడు త్యాగ్‌నారాయణ్. అలా వీరిద్దరు కలిసి తొలి వికెట్‌కు 71 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మెకంజీ ఓ సిక్స్, ఫోర్ ఊపుగా కనిపించాడు. అయితే ఈ క్రమంలోనే రెండో రోజు ఆటను ముగిసింది.
కోహ్లీ ట్రేడ్ మార్క్ షాట్.. ఇకపోతే 87 పరుగుల వ్యక్తిగత స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించాడు కోహ్లీ. ఈ క్రమంలోనే 206 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 121 శతకం బాది మరోసారి అభిమానులను ఆకట్టుకున్నాడు. స్క్వేర్ డ్రైవ్‌తో 180 బంతుల్లో మూడంకెల స్కోరును అందుకున్న విరాట్.. తనదైన శైలిలో సంబరాలు కూడా చేసుకున్నాడు. దాదాపు నాలుగున్నరేళ్లకు పైగా విరామం తర్వాత భారత్ అవతల విదేశీ గడ్డపై సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే శతకం పూర్తి చేసుకున్న కోహ్లీ.. ఆ తర్వాత వారికన్ వేసిన 99వ ఓవర్‌లో రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. స్ట్రైకింగ్‌లో ఉన్న విరాట్.. సింగిల్‌కు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే వెస్టిండీస్ ప్లేయర్.. జోసెఫ్ నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో వికెట్‌కు నేరుగా బంతిని విసిరడం వల్ల పెవిలియన్ చేరాల్సి వచ్చింది. అయితే ఆడే క్రమంలోనే కోహ్లీ.. ఓ సారి తన ట్రేడ్‌మార్క్ షాట్ కవర్ డ్రైవ్‌ను కూడా ఆడాడు. అది ప్రస్తుతం సోషల్‌మీడియా ఫుల్ ట్రెండ్ కూడా అవుతోంది.