ind vs wi 2023 2nd test day 3 highlights : మొదటి టెస్టులో టీమ్‌ఇండియా చేతిలో ఘోర ఓటమిని అందుకున్న వెస్టిండీస్.. రెండో మ్యాచ్‌లో మాత్రం గట్టిగా పోరాడుతోంది. ఇరు జట్ల మధ్య ఇది వందో టెస్టు కావడం(ఈ సిరీస్‌లో చివరి టెస్టు) ఆ జట్టులో మరింత కసిని పెంచినట్టుంది. మూడో రోజు ఆట పూర్తయ్యే సమయానికి 229/5 స్కోరుతో నిలిచింది. ఫలితంగా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇంకా 209 పరుగుల వెనుకంజలో ఉంది. జేసన్ హోల్డర్ (11*), అథనేజ్ (37*) క్రీజులో కొనసాగుతున్నారు. క్రెయిగ్ బ్రాత్‌వైట్ 75 పరుగులతో రాణించాడు. కిర్క్ మెకంజీ (32), బ్లాక్‌వుడ్ (20), జాషువా ద సిల్వా (10) పరుగులు తమ ఖాతాలో వేసుకున్నారు. టీమ్‌ఇండియా బౌలర్లలో జడ్డూ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. మహ్మద్ సిరాజ్, అశ్విన్, ముఖేశ్ కుమార్ ఒక్కో వికెట్ పడగొట్టారు. అయితే మ్యాచ్ మధ్యలో పలుమార్లు వర్షం పడటం వల్ల అంతరాయం కలిగించింది.
మూడో రోజు ఆట సాగిందిలా.. 86/1తో మూడో రోజు ఆటను ప్రారంభించింది విండీస్. మొదటి సెషన్‌లో ఆచితూడి నిలకడగా ఆడింది విండీస్. అయితే కాస్త ఊపుమీదున్న మెకంజీని.. టీమ్‌ఇండియా అరంగేట్ర బౌలర్ ముకేశ్ కుమార్ ఔట్ చేశాడు. అతడు ఔటయ్యాక వెంటనే వర్షం మొదలైంది. దీంతో ఆటను కాసేపు ఆపేశారు. వర్షం వల్ల మొదటి సెషన్‌లో 10.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.
రెండో సెషన్‌లో బ్లాక్‌వుడ్ సహకారంతో బ్రాత్‌వైట్ మంచిగా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. 170 బంతుల్లో హఫ్ సెంచరీ చేశాడు. అయితే అతడిని అశ్విన్.. తన డెలివరీతో క్లీన్‌బౌల్డ్ చేశాడు. అనంతరం అథనేజ్‌తో కలిసి బ్లాక్‌వుడ్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. అలా టీ బ్రేక్ సమయానికి (174/3) స్కోరు చేసింది విండీస్.