IND Vs WI 1st T20 ICC : వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ట్రినిడాడ్‌లో జరిగిన తొలి టీ20లో ఓటమిపాలైన టీమ్ఇండియాకు ఐసీసీ షాక్ ఇచ్చింది. స్లో ఓవర్ రేట్ కారణంగా భారత్, విండీస్ జట్లకు జరిమానా విధించింది. నిర్దిష్ట సమయానికి భారత్ ఒక ఓవర్, విండీస్ రెండు ఓవర్లు వెనుకపడి ఉండటంతో భారత్ ఫీజులో ఐదు శాతం, వెస్టిండీస్ మ్యాచ్ ఫీజులో పది శాతం కోత విధించింది.
అయితే గురువారం జరిగిన మ్యాచ్‌లో 150 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా.. నాలుగు పరుగు తేడాతో ఓటిమి పాలైంది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది భారత్. హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ(39) ఒక్కడే రాణించాడు. సూర్యకుమార్ యాదవ్ (21), హార్దిక్ పాండ్య (19) నిలకడగానే ఆడినా.. ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (6), శుభ్‌మన్ గిల్ (3) సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. సంజు శాంసన్ (12), అక్షర్ పటేల్ (13) కూడా నిరాశపర్చారు.
ఆఖరి రెండు ఓవర్లలో భారత్ విజయానికి 21 పరుగులు అవసరమైన దశలో అక్షర్ ఔట్ కావడంతో మ్యాచ్ విండీస్ వైపు మళ్లింది. ఈ క్రమంలో అర్ష్‌దీప్ సింగ్ (12) వరుసగా రెండు ఫోర్లు కొట్టడంతో టీమ్‌ఇండియా ఆశలు చిగురించాయి. చివరి ఓవర్ (షెఫర్డ్)లో 10 పరుగులు చేయాల్సి ఉండగా.. తొలి బంతికి కుల్‌దీప్ యాదవ్ (3) ఔటయ్యాడు. తర్వాతి మూడు బంతుల్లో మూడు పరుగులు వచ్చాయి. ఐదో బంతికి అర్ష్‌దీప్ సింగ్ రనౌటై తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు. విండీస్ బౌలర్లలో మెకాయ్, హోల్డర్, షెఫర్డ్ తలో రెండు వికెట్లు తీశారు.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (41), రోవ్‌మన్ పావెల్ (48) రాణించారు. బ్రెండన్ కింగ్ (28) ఫర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో చాహల్ 2, అర్ష్‌దీప్ సింగ్ 2, కుల్‌దీప్ యాదవ్, హార్దిక్ పాండ్య ఒక్కో వికెట్ పడగొట్టారు. జేసన్ హోల్డర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. కాగా, ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆదివారం (ఆగస్టు 6)న జరగనుంది.