IND VS SA KL Rahul: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల తర్వాత ప్రస్తుత భారత క్రికెట్ జట్టులో ఆ స్థాయి బ్యాటర్‌గా, మూడు ఫార్మాట్లలో సుదీర్ఘ కాలం టీమ్‌ఇండియాకు ప్రాతినిధ్యం వహించి, గొప్ప ఆటగాళ్ల జాబితాలో చేరగల సామర్థ్యం ఉన్నవాడిగా పేరుంది కేఎల్ రాహుల్‌కు. అయితే ప్రతిభ విషయంలో ఏ లోటూ లేకపోయినా.. ఇంకా రాహుల్ పూర్తి స్థాయి మ్యాచ్ విన్నర్‌గా మారలేదన్నది విశ్లేషకుల మాట. ఇటు ఐపీఎల్‌లో, అటు అంతర్జాతీయ క్రికెట్లో అతను కెప్టెన్‌గా లభించిన అవకాశాలను కూడా ఉపయోగించుకోలేకపోయాడు. అయితే దక్షిణాఫ్రికాతో అయిదు టీ20ల సిరీస్‌లో కుర్రాళ్లతో నిండిన భారత జట్టును నడిపించే బాధ్యతను సెలక్టర్లు అతడికే అప్పగించారు. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా బలమైన ముద్ర వేయడానికి రాహుల్‌కిది చక్కటి అవకాశమే.
2014లో అంతర్జాతీయ అరంగేట్రం టెస్టులతో చేసి, కెరీర్ ఆరంభంలోనే సెంచరీల మోత మోగించి అందరి దృష్టిలో పడ్డ ఆటగాడు కేఎల్ రాహుల్. సాంకేతికంగా సమకాలీన ప్రపంచ స్థాయి బ్యాట్స్‌మెన్‌లో ఎవరికీ తీసిపోని ఆట అతడిది. తన టెక్నిక్, దృక్పథం గురించి దిగ్గజాలు ప్రశంసలు కురిపిస్తుంటారు. అలవోకగా భారీ ఇన్నింగ్స్‌లు ఆడగల సామర్థ్యంతో చాలా వేగంగా టెస్టు జట్టులో కీలక ఆటగాళ్లలో ఒకడిగా ఎదిగిన కేఎల్.. తర్వాత వన్డేలు, టీ20ల్లోకి కూడా అడుగు పెట్టాడు. ఆ జట్లలోనూ స్థానం సుస్థిరం చేసుకున్నాడు. కాకపోతే తన ప్రతిభకు పూర్తి స్థాయిలో న్యాయం చేయట్లేదనే విమర్శ అతడి మీద ఎప్పట్నుంచో ఉంది. సామర్థ్యానికి తగ్గట్లు ఆడి ఉంటే, నిలకడ సాధించి ఉంటే కోహ్లి, రోహిత్‌ల స్థాయిని అందుకుని ఉండేవాడంటారు విశ్లేషకులు. ఒక మ్యాచ్‌లో అద్భుతంగా ఆడడం, ఇంకో మ్యాచ్‌లో తేలిపోవడం.. జట్టు కష్టాల్లో ఉన్న సమయాల్లో, తన మీద ఆశలు పెట్టుకున్నపుడు విఫలమవడం అతడికి ప్రతికూలంగా మారింది. ఎనిమిదేళ్ల రాహుల్ అంతర్జాతీయ కెరీర్లో ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి నిలిచి ఆడిన భారీ ఇన్నింగ్స్ తక్కువే కనిపిస్తాయి. వన్డే, టీ20 ప్రపంచకప్‌ల్లోనూ అతను తనపై పెట్టుకున్న అంచనాలను అందుకోలేకపోయాడు. అయితే టెస్టుల్లో మినహా అతడి గణాంకాలు మెరుగ్గా ఉండడం (43 టెస్టుల్లో 35.37 సగటుతో 2547 పరుగులు, 42 వన్డేల్లో 46.68 సగటుతో 1634 పరుగులు, 56 టీ20ల్లో 40.68 సగటుతో 1831 పరుగులు)తో అతడి స్థానానికి ఢోకా లేకుండా పోతోంది. కానీ రాహుల్ నిలకడ అందుకోవాలని, గొప్ప ఇన్నింగ్స్ మరిన్ని ఆడాలని, ఉత్తమ బ్యాట్స్‌మన్‌గా పేరు తెచ్చుకోవాలని, అలాగే భారత జట్టుకు పూర్తి స్థాయి కెప్టెన్ కావాలని తన అభిమానులు ఆశిస్తున్నారు. ఈ దిశగా తనేంటో రుజువు చేసుకోవడానికి దక్షిణాఫ్రికా సిరీస్ మంచి అవకాశంలా కనిపిస్తోంది.