IND Vs SL World Cup 2023 Record :సొంతగడ్డపై జరుగుతున్న మెగా టోర్నీ- 2023 ప్రపంచకప్‌లో రోహిత్ సేన తగ్గేదేలే అంటూ దూసుకెళ్తోంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 302 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను మట్టికరిపించింది. ఈ విక్టరీతో టీమ్ఇండియా వరసుగా ఏడో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. తద్వారా సెమీస్ రేసుకు దూసుకెళ్లిన తొలి జట్టుగా అవతరించింది. ఈ నేపథ్యంలో పలు రికార్డులను టీమ్ఇండియా తమ పేరిట లిఖించుకుంది .
అప్పుడు 8.. ఇప్పుడు 7
ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో ఆడిన ప్రతి మ్యాచ్‌నూ గెలిచింది భారత్. ఇలా ఒకే ప్రపంచకప్‌లో వరుసగా ఏడు విజయాలను నమోదు చేయడం కూడా ఓ రికార్డే. ఈ విజయాలను ఇప్పటికే ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌పై వరుసపెట్టి సాధించింది. అంతకుముందు 2003లో జరిగిన ప్రపంచకప్‌లో వరుసగా ఎనిమిది మ్యాచ్‌ల్లో నెగ్గింది భారత్. ఇలా వరుసపెట్టి విజయాల సాధించడం టీమ్ఇండియాకు ఇది రెండొసారి.
వరుసగా నాలుగు టోర్నీల్లో ఆసీస్..
ఇదిలాఉంటే ఒకే ప్రపంచకప్‌లో అత్యధికంగా వరుస విజయాల నమోదు చేసిన రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉంది. 2003 వరల్డ్‌కప్‌లో ఆసీస్ వరుసగా 13 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఆ తరువాత జరిగిన 2007 ప్రపంచకప్‌లోనూ కంగారూలు వరుసగా 12 మ్యాచ్‌ల్లో నెగ్గారు. ఈ రెండు ఎడిషన్లలో ఆస్ట్రేలియా ప్రపంచకప్ విజేతగా నిలిచింది. ఇలా ఈ రెండు టోర్నీల్లోనే కాకుండా 2003కి ముందు 1999లో జరిగిన పోరులో, 2007 తర్వాత 2011లో జరిగిన ప్రపంచకప్‌లోనూ ఆస్ట్రేలియా ఇలా వరుసపెట్టి విజయాలను నమోదు చేసింది. మొత్తంగా వరల్డ్‌కప్‌లో అత్యధిక వరుస విజయాలు సాధించిన రికార్డు అయితే ప్రస్తుతానికి ఆసీస్ పేరిటే ఉంది.
- 1999 ప్రపంచకప్- వరుసగా 7 మ్యాచ్‌లు
- 2003 ప్రపంచకప్- వరుసగా 13 మ్యాచ్‌లు
- 2007 ప్రపంచకప్- వరుసగా 12 మ్యాచ్‌లు
- 2011 ప్రపంచకప్- వరుసగా 4 మ్యాచ్‌లు
ఇలా ఆసీస్ క్రికెట్ జట్టు వరుస టోర్నీల్లో వరుసగా 36 మ్యాచ్‌ల్లో గెలిచిన రికార్డుకు 2011 వరల్డ్‌కప్‌లో బ్రేక్ పడింది. ఈ ఎడిషన్‌లో పాకిస్థాన్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో ఓటమిపాలైంది.