శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌లో ప్రతి ఆటగాడికి అవకాశం ఇవ్వడం కుదరదని స్పష్టం చేశాడు భారత కోచ్ రాహుల్ ద్రవిడ్. కానీ, సీనియర్ల నుంచి యువ ఆటగాళ్లు నేర్చుకోవడానికి ఇదొక మంచి అవకాశమని పేర్కొన్నాడు. మంచి క్రికెటర్‌గా మెరుగవ్వడానికి ఈ టూర్ సువర్ణావకాశమని తెలిపాడు.
"ఇది పూర్తిగా భిన్నమైన పర్యటన. ఈ చిన్న టూర్లో యువ ఆటగాళ్లందరికీ అవకాశం లభిస్తుందనేది నిజం కాదు. కానీ, వారు నేర్చుకోవడానికి ఇదొక సువర్ణావకాశం. శిఖర్, భువనేశ్వర్ వంటి సీనియర్ల అనుభవాలు వారికి తోడ్పడ్తాయి. ఈ పర్యటన ద్వారా యువకులు వీలైనన్నీ కొత్త విషయాలు తెలుసుకుంటారు. 20 మందితో కూడిన మంచి స్క్వాడ్ మాకు అందుబాటులో ఉంది."
-రాహుల్ ద్రవిడ్, టీమ్ఇండియా ప్రధాన కోచ్.
ఇదీ చదవండి:సచిన్ బ్యాట్ టు కోహ్లీ జెర్సీ: ఈ మ్యూజియాన్ని చూశారా?
ఇదొక సవాలు..
శ్రీలంక టూర్ తమకు సవాలు లాంటిదని పేర్కొన్నాడు టీమ్ఇండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ శిఖర్ ధావన్. యువ ఆటగాళ్లు తమను తాము నిరూపించుకోవడానికి ఇదొక గొప్ప అవకాశమని తెలిపాడు. ప్రధాన జట్టులో స్థానం సంపాదించడానికి ఈ సిరీస్ తోడ్పడనుందని పేర్కొన్నాడు. కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో కలిసి సంయుక్తంగా నిర్వహించిన వర్చువల్ మీడియా సమావేశంలో ధావన్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
"ఇది చాలా మంచి జట్టు. టీమ్‌లోని ఆటగాళ్లందరూ సానుకూల దృక్పథం, ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. మంచి ప్రదర్శన చేస్తామనే నమ్మకం అందరిలో కనపడుతోంది. ప్రతి ఒక్కరూ అవకాశం ఎదురుచూస్తున్నారు. మా జట్టుకిది కొత్త సవాలు. అదే సమయంలో ఇదొక గొప్ప అవకాశం. ప్రతి ఆటగాడు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి వేచి చూస్తున్నారు."
-శిఖర్ ధావన్, టీమ్ఇండియా కెప్టెన్.
గత 14 రోజులుగా కఠిన క్వారంటైన్లో గడిపిన తమకు లంకతో సిరీస్‌కు ముందు 10-12 రోజుల సన్నద్ధత సమయం ఉందని ధావన్ తెలిపాడు. సీనియర్లు, జూనియర్ల కలయికతో జట్టు మంచి సమతూకంతో ఉందన్నాడు. దేవ్‌దత్ పడిక్కల్, పృథ్వీ షా, ఇషాన్ కిషన్, సంజు శాంసన్ వంటి ఆటగాళ్లు ఇప్పటికే ఐపీఎల్లో తామేంటో నిరూపించుకున్నారని తెలిపాడు.
జులై 13-25 వరకు శ్రీలంక పర్యటన సాగనుంది.
ఇదీ చదవండి:యువ సంచలనం షెఫాలీ ఖాతాలో సరికొత్త రికార్డు