Kohli century in 100 Test: వందో టెస్టు.. ఈ మైలురాయిని చేరుకుంటే దిగ్గజ హోదాను అందుకున్నట్లే. అయితే విరాట్ కోహ్లి ఇందులో సగం మ్యాచ్‌లు ఆడేసరికే దిగ్గజ ఆటగాళ్ల జాబితాలోకి చేరిపోయాడు! మామూలుగా అయితే వంద టెస్టుల మైలురాయిని అందుకోవడం విరాట్‌కు ఒక లాంఛనం మాత్రమే! కానీ రెండేళ్లుగా తన స్థాయికి తగ్గట్లు ఆడలేక, ఒకప్పుడు మంచినీళ్ల ప్రాయంగా శతకాలు బాదిన వాడు.. సుదీర్ఘ కాలం పాటు మూడంకెల స్కోరు కోసం నిరీక్షిస్తూ, మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీకి కూడా దూరమైన సమయంలో వందో టెస్టు ఆడుతుండటంతో ఈ మ్యాచ్‌పై అందరి దృష్టీ పడింది. మొహాలిలో విరాట్ తన మార్కు ఆట ఆడి, శతక టెస్టును చిరస్మరణీయం చేసుకోవాలన్నది అభిమానుల ఆకాంక్ష. అందుకోసం కోహ్లి ఎలా ప్రేరణ పొందుతాడన్నది ఆసక్తికరం.
తనకు తనే స్ఫూర్తి
ఫామ్ అందుకోవడానికి, శతక మోత మోగించడానికి విరాట్ ఎవరినో చూసి స్ఫూర్తి పొందాల్సిన పని లేదు. తనకు తనే స్ఫూర్తి. అతడి పట్టుదల, పోరాట తత్వం ఎలాంటిదో చెప్పడానికి వెనుదిరిగి చూస్తే ఎన్నో ఉదాహరణలున్నాయి. ముఖ్యంగా ఇంగ్లిష్ గడ్డపై అతడి విజయగాథను మించిన స్ఫూర్తి ఇంకేముంటుంది? 2014లో తొలిసారి ఇంగ్లాండ్‌లో పర్యటించినపుడు అండర్సన్ బృందం స్వింగ్ బంతుల్ని ఎదుర్కోలేక విరాట్ పడ్డ అవస్థ అంతా ఇంతా కాదు. అయిదు టెస్టుల్లో కలిపి 10 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 13.4 సగటుతో 134 పరుగులు మాత్రమే చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు కోహ్లి. అప్పటిదాకా సచిన్ వారసుడు, నయా మాస్టర్ అన్నవాళ్లు ఈ పర్యటనలో అండర్సన్ అతడితో ఆటాడుకున్న తీరు చూసి తన టెక్నిక్‌పై అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ తర్వాత వేరే దేశాల్లో ఎంత గొప్పగా ఆడినా.. 2014 ఇంగ్లాండ్ పర్యటన కెరీర్‌కు ఒక మచ్చలా ఉండిపోయింది. కానీ 2018లో ఆ దేశ పర్యటనకు వెళ్లి మొత్తం లెక్కలన్నీ సరి చేశాడు కింగ్. ఈసారి 5 టెస్టుల్లో కలిపి 10 ఇన్నింగ్స్‌ల్లో 59.3 సగటుతో ఏకంగా 593 పరుగులు చేశాడతను. అందులో 2 శతకాలు, 3 అర్ధశతకాలున్నాయి. 2018 పర్యటన తొలి ఇన్నింగ్స్‌లోనే 149 పరుగులతో అండర్సన్ బృందానికి అతను సమాధానం చెప్పిన తీరును అభిమానులెవరూ అంత సులువుగా మరిచిపోలేరు. ఇలా వివిధ దేశాల్లో కఠిన పరిస్థితుల్లో మేటి బౌలింగ్ దళాల్ని కోహ్లి ఎంతో గొప్పగా ఎదుర్కొన్నాడు? 2014లో ఇంగ్లిష్ గడ్డపై పేలవ ప్రదర్శన చేశాక.. కొన్ని నెలల్లో ఆస్ట్రేలియాకు వెళ్లి విరాట్ చెలరేగిన వైనం అసాధారణం. ధోని గైర్హాజరీలో తాత్కాలికంగా ఓ మ్యాచ్‌కు సారథ్యం అప్పగిస్తే.. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాల మోత మోగించి, ఓటమికి వెరవకుండా జట్టు డ్రా కోసం కాకుండా గెలుపు కోసం ఆడేలా ప్రేరేపించి, అద్భుత శతకంతో సహచరులను ముందుండి నడిపించి.. కంగారూలకు చెమటలు పట్టించాడు విరాట్. ఆ మ్యాచ్‌లో భారత్ త్రుటిలో ఓడినా.. బ్యాట్స్‌మెన్‌గా అతడి నైపుణ్యం, కెప్టెన్‌గా అతడి తెగువ ప్రశంసలందుకున్నాయి. అవి చూసే ధోని ఆలస్యం చేయకుండా సిరీస్ మధ్యలోనే అతడికి టెస్టు పగ్గాలు అప్పగించేసి తప్పుకున్నాడు. ఈ సిరీస్‌లో కోహ్లి 4 టెస్టుల్లో 4 శతకాలు సహా 86.5 సగటుతో 692 పరుగులు చేయడం విశేషం. సిరీస్ ప్రదర్శనలే కాదు.. ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ పోతే కోహ్లి మేటి ఇన్నింగ్స్‌ల జాబితా పెద్దదే. 2012లో అడిలైడ్ టెస్టు సందర్భంగా సచిన్ సహా ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా విఫలమైన స్థితిలో మేటి ఆస్ట్రేలియా పేస్ దళాన్ని ఎదుర్కొంటూ సాధించిన తొలి సెంచరీ (118).. 2013లో సచిన్ రిటైరయ్యాక తొలిసారి అతనాడే నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి స్టెయిన్ దళాన్ని సమర్థంగా ఎదుర్కొంటూ దక్షిణాఫ్రికాపై సాధించిన శతకం (119).. ఆ దేశంలో 2018లో సఫారీ పేసర్లు నిప్పులు చెరిగిన సెంచూరియన్ టెస్టుల్లో జట్టు మొత్తం కలిపి 307 పరుగులు చేస్తే అందులో సగం పరుగులతో తన స్థాయిని చాటిన 153 పరుగుల ఇన్నింగ్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే విరాట్ టెస్టు కెరీర్లో ఆణిముత్యాలు ఎన్నో! మరి తన మేటి ఇన్నింగ్స్‌లే స్ఫూర్తిగా.. తన నుంచి తనే ప్రేరణ పొంది ఒకప్పటి విరాట్ అభిమానుల ముందుకొస్తాడేమో చూడాలి. కాగా, అంతర్జాతీయ క్రికెట్లో 100 టెస్టుల మైలురాయి చేరుకున్న 71వ ఆటగాడిగా కోహ్లి నిలవనున్నాడు. 11 మంది భారత ఆటగాళ్లు ఇప్పటికే ఈ ఘనత అందుకున్నారు.
"వంద టెస్టుల క్లబ్‌లోకి కోహ్లికి స్వాగతం. భారత క్రికెట్లో కొద్దిమంది మాత్రమే ఆ ఘనత సాధించారు. అదో అద్భుత మైలురాయి. విరాట్ గొప్ప ఆటగాడు. అందుకు పూర్తి అర్హుడు. కోహ్లిటెక్నిక్, సానుకూల దృక్పథం, ఫుట్‌వర్క్‌ను ఎంతగానో ఇష్టపడతా. 2014లో పేలవ ఫేమ్ నుంచి విరాట్ బయటపడిన తీరు అద్భుతం."