తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND VS SL: ఆ ముగ్గురు అదరగొట్టేశారుగా! - టీమ్​ఇండియా వర్సెస్​ శ్రీలంక పంత్​

IND VS SL Test series: శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్​లో టీమ్​ఇండియా అద్భుత విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టును వైట్​వాష్​ చేసింది. అయితే ఈ సిరీస్​లో ఉత్కంతఠ దొరకక అభిమానులు నిరాశపడినా.. ఈ పోరు భారత జట్టుకు మాత్రం మేలే చేసింది. ఈ సిరీస్​లో శ్రేయస్​ అయ్యర్​, విహారి, జడేజా అద్భుతంగా ఆడటం వల్ల.. అటు అభిమానులకు, ఇటు సెలక్షన్​ కమిటీకి ఎదురైన ప్రశ్నలకు సమాధానం దొరికింది. భవిష్యత్​పై భరోసా వచ్చింది.

IND VS SL Test series
IND VS SL Test series

By

Published : Mar 15, 2022, 7:14 AM IST

IND VS SL Test series: ఈ ఏడాది స్వదేశంలో భారత చివరి టెస్టు సిరీస్‌.. ప్రత్యర్థేమో శ్రీలంక. అసలే సంధి దశలో ఉన్న లంకను బలంగా కనిపిస్తున్న టీమ్‌ఇండియా చిత్తుచేయడం ఖాయమని ముందే ఒక అంచనా ఏర్పడిపోయింది. అందుకు తగ్గట్లుగానే రెండు టెస్టులనూ మూడు రోజుల్లోపే రోహిత్‌ సేన ముగించింది. హోరాహోరీ టెస్టు క్రికెట్‌ మజా దక్కక అభిమానులు నిరాశపడ్డారు. కానీ టీమ్‌ఇండియాకు మాత్రం ఈ సిరీస్‌ చాలా మేలే చేసింది. చాలా కాలం తర్వాత పుజారా, రహానె లేకుండా జట్టు ఆడడంతో.. వాళ్ల స్థానాలు భర్తీ చేసే ఆటగాళ్లు ఎవరనే ప్రశ్నలు రేకెత్తాయి. కానీ ఇప్పుడు విహారి, శ్రేయస్‌ల ఆట చూశాక భవిష్యత్‌పై భరోసా వచ్చింది. మరోవైపు తన బ్యాటింగ్‌తో, బౌలింగ్‌తో జట్టుకు సమతూకాన్ని తెస్తున్న జడేజా ప్రధాన ఆయుధంగా మారాడు.

అవకాశాన్ని అందిపుచ్చుకుని..

IND VS SL Test series Shreyas iyer: ప్రతిభావంతుడైన బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ గాయాలు, నిలకడ లేమితో శ్రేయస్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌ ప్రయాణం ఒడుదొడుకులతో సాగుతోంది. మరోవైపు కుర్రాళ్ల నుంచి పోటీ ఎక్కువ కావడంతో ఆ ఫార్మాట్లలో జట్టులో చోటు కష్టమైంది. అలాంటి ఆటగాడు అనూహ్యంగా వచ్చిన టెస్టు అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. రోహిత్‌కు విశ్రాంతినివ్వడంతో గతేడాది సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో సిరీస్‌తో అరంగేట్రం చేసిన అతను.. తన తొలి టెస్టులోనే ఓ శతకం, అర్ధసెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. అరంగేట్ర టెస్టులో ఆ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడిగా చరిత్ర తిరగరాశాడు. అప్పటి నుంచి అతని ప్రయాణం మరో మలుపు తీసుకుంది. ఇప్పుడు రహానె స్థానంలో మిడిలార్డర్‌లో పాతుకుపోయే దిశగా సాగుతున్నాడు. తాజాగా శ్రీలంకతో డేనైట్‌ టెస్టులో క్లిష్ట పరిస్థితుల్లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అర్ధశతకాలు సాధించిన అతని బ్యాటింగ్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇప్పటివరకూ నాలుగు టెస్టుల్లో 55.42 సగటుతో 388 పరుగులు చేసిన అతను.. జట్టు మిడిలార్డర్‌ సమస్యను తీర్చినట్లే కనిపిస్తున్నాడు.

ఎదురు చూపులు ఫలించి..

IND VS SL Test series hanuma vihari: ఆడిన మ్యాచ్‌ల్లో ప్రదర్శనేమీ పేలవంగా లేదు.. కానీ జట్టు కూర్పు కోసం ప్రతిసారి హనుమ విహారి బలయ్యేవాడు. అదనపు స్పిన్నర్‌ కావాలన్నా.. బ్యాటింగ్‌ చేయగలిగే బౌలర్‌ కావాలన్నా విహారిపైనే వేటు పడేది. జట్టులో స్థానం కోసం తన ఆఫ్‌స్పిన్‌ పైనా అతను దృష్టి సారించాడు. కానీ ఫలితం దక్కలేదు. విదేశాల్లో ఫాస్ట్‌పిచ్‌లపై ఆడేటపుడు మాత్రమే అవకాశమిచ్చి.. స్వదేశీ టెస్టుల్లో సెలక్షన్‌ కమిటీ అతణ్ని పక్కనపెడుతుండడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. టీమ్‌ఇండియాలో చోటు దక్కకున్నా.. భారత్‌-ఎ తరపున ఆడుతూ నిలకడగా రాణించాడు. ఇప్పుడు పుజారాపై వేటు పడడంతో శ్రీలంకతో సిరీస్‌లో మూడో స్థానంలో ఆడే అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకునే దిశగా సాగుతున్నాడు. తొలి టెస్టులో ఏకైక ఇన్నింగ్స్‌లో అర్ధశతకం సాధించిన అతను.. డేనైట్‌ టెస్టులోనూ రెండు ఇన్నింగ్స్‌ల్లో ఎక్కువ సమయం క్రీజులో గడిపాడు. మంచి ఆరంభాలతో 30కి పైగా స్కోర్లు సాధించిన అతను.. మరింత ఏకాగ్రతతో బ్యాటింగ్‌ చేస్తే మూడో స్థానంలో పాగా వేయడం ఖాయం.

జడ్డూ.. తగ్గేదేలే..

IND VS SL Test series ravindra jadeja: ఓపికగా క్రీజులో పాతుకుపోగలడు.. బౌండరీలతో స్కోరు వేగాన్ని పెంచగలడు.. స్పిన్‌తో ప్రత్యర్థిని చుట్టేయగలడు.. ఫీల్డింగ్‌లో మెరుపు విన్యాసాలతో అదరగొట్టగలడు.. ఇలా తగ్గేదేలే అంటూ జడేజా సాగుతున్నాడు. అసలు సిసలైన ఆల్‌రౌండర్‌కు పర్యాయ పదంగా మారుతున్నాడు. ఇటీవల అతని ప్రదర్శన ఎంతో మెరుగైంది. జట్టు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బ్యాట్‌తో.. వికెట్లు అవసరమైనప్పుడు బంతితో రాణిస్తున్నాడు. శ్రీలంకతో తొలి టెస్టులోనైతే ఏకంగా విశ్వరూపమే చూపించాడు. తన కెరీర్‌లో చిరస్మరణీయంగా మిగిలిపోయేలా బ్యాట్‌తో అజేయంగా 175 పరుగులు చేయడమే కాకుండా.. బౌలింగ్‌తో మ్యాచ్‌లో మొత్తం 9 వికెట్లు పడగొట్టాడు. గాయం నుంచి కోలుకుని వచ్చి పునరాగమనం చేసిన తొలి మ్యాచ్‌లోనే అతని నుంచి ఇలాంటి ప్రదర్శన జట్టుకు ఎంతో ఆనందాన్నిచ్చేదే. జడ్డూ ఇదే జోరు కొనసాగిస్తే జట్టుకు తిరుగుండదు.

పంత్​.. వందకు వంద

IND VS SL Test series Pant: రిషబ్‌ పంత్‌ బ్యాట్స్‌మన్‌గా కొత్తగా రుజువు చేసుకోవాల్సిందేమీ లేదు. వివిధ ఫార్మాట్లలో బ్యాటుతో తన దూకుడు చూపిస్తూ జట్టు కోసం ఎన్నో ఉపయుక్తమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ముఖ్యంగా టెస్టుల్లో అతడి కొన్ని ఇన్నింగ్స్‌ల విలువ అమూల్యం. ప్రస్తుత లంక సిరీస్‌లోనూ అతను బ్యాట్స్‌మన్‌గా అదరగొట్టాడు. తొలి టెస్టులో 96 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌.. రెండో మ్యాచ్‌లో 39, 50 పరుగులతో జట్టుకు ఎంతో ఉపయోగపడ్డాడు. ఈ సిరీస్‌లో కేవలం బ్యాట్స్‌మన్‌గానే కాక వికెట్‌ కీపర్‌గానూ అతను అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. అతను ఒక్క క్యాచ్‌ కూడా జారవిడువలేదు. స్టంపింగ్స్‌ విషయంలో చిన్న అవకాశం వచ్చినా విడిచిపెట్టలేదు. లంక రెండో ఇన్నింగ్స్‌లో కుశాల్‌, డిక్వెలాల మెరుపు స్టంపింగ్స్‌ చూసిన అభిమానులకు ధోని గుర్తొచ్చి ఉంటే ఆశ్చర్యం లేదు. మొత్తంగా ఈ సిరీస్‌లో పంత్‌ ప్రదర్శనకు వందకు వంద మార్కులు పడతాయి. అందుకే జడేజా, బుమ్రా, శ్రేయస్‌ల రూపంలో గట్టి పోటీదారులున్నప్పటికీ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అతడికే దక్కింది.

ఇదీ చూడండి:

అశ్విన్ అరుదైన ఘనత.. స్వదేశంలో టీమ్​ఇండియా రికార్డు

INDIA VS SRI LANKA: గులాబీ టెస్టులో టీమ్​ఇండియా ఘన విజయం

ABOUT THE AUTHOR

...view details