IND VS SL: శ్రీలంకతో తొలి టెస్ట్‌లో భారత్ ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకే ఆలౌటైన లంక ఫాలో ఆన్‌లోనూ చతికిలపడింది. ఫాలోఆన్ బ్యాటింగ్ దిగిన శ్రీలంక జట్టు 178 పరుగులు చేసి కుప్పకూలింది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 4 వికెట్లు తీసి లంకను ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. రవిచంద్రన్ అశ్విన్ 4 వికెట్లు, మహ్మద్ షమీ 2 వికెట్లు తీశారు. దీంతో మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగిసింది.
మూడో రోజు ఆటలో భాగంగా తొలి సెషన్లో భారత బౌలర్లు అదరగొట్టారు. జడేజా ఐదు వికెట్లు తీశాడు. నిస్సంక (61*) ఒక్కడే అర్ధ శతకంతో రాణించాడు. మిగతా బ్యాటర్లంతా పూర్తిగా విఫలమయ్యారు. ఆదివారం ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన శ్రీలంక మరో 66 పరుగులు జోడించి మిగిలిన ఆరు వికెట్లు కోల్పోయింది. అంతకుముందు ఓవర్‌నైట్ బ్యాటర్లు అసలంక, నిస్సంక తొలి గంట సేపు జాగ్రత్తగా ఆడారు. అయితే, ఈ జోడీని బుమ్రా విడదీశాడు. జట్టు స్కోరు 161 పరుగుల వద్ద అసలంకను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపడం వల్ల లంక సగం వికెట్లు కోల్పోయింది. అనంతరం భారత బౌలర్లు చెలరేగి 13 పరుగుల తేడాతో మిగిలిన ఐదు వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలోనే జడేజా ఐదు వికెట్ల ఘనత సాధించాడు. బుమ్రా, అశ్విన్ తలో రెండు వికెట్లు తీయగా.. షమీ ఓ వికెట్ దక్కించుకున్నాడు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగుల సంపూర్ణ ఆధిక్యం లభించింది. వెంటనే శ్రీలంకను ఫాలోఆన్‌కు దించింది భారత్.