IND VS SL first T20 Rohith record: టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. గురువారం (ఫిబ్రవరి 24) నుంచి శ్రీలంకతో ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌లో మరో 37 పరుగులు చేస్తే.. టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఘనత సాధించనున్నాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ 3,263 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ 3,299 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 3,296 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.
మరో మూడు మ్యాచులు ఆడితే ఆ రికార్డు కూడా తనదే..
శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్‌లో రోహిత్ శర్మ మరో రికార్డును కూడా బద్దలు కొట్టనున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక మ్యాచులు ఆడిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పేందుకు హిట్‌మ్యాన్ 3 మ్యాచుల దూరంలో ఉన్నాడు. ఇప్పటివరకు 122 టీ20 మ్యాచులు ఆడిన రోహిత్ ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్ ఆటగాడు షోయబ్ మాలిక్ 124 మ్యాచులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కేవలం 9 మంది ఆటగాళ్లు మాత్రమే 100పైగా టీ20 మ్యాచులు ఆడారు. భారత్ నుంచి వందకు పైగా టీ20 మ్యాచులు ఆడిన ఏకైక ఆటగాడు రోహిత్ కావడం గమనార్హం. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (98 మ్యాచులు), విరాట్ కోహ్లీ (97 మ్యాచులు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఇదీ చదవండి:IND VS SL: లంకతో సమరానికి టీమ్ఇండియా సై