Ind Vs SL Rain Update : ఆసియా కప్‌లో భాగంగా జరగనున్న ఆఖరి పోరుకు సర్వం సిద్ధమైంది. ఈ టోర్నీలో గెలిచి కప్‌ను ముద్దాడేందుకు భారత్ - శ్రీలంక జట్లు తీవ్రంగా కసరత్తులు చేస్తున్నాయి. అయితే, కొలంబో వేదికగా జరగనున్న ఈ ఆసియా కప్ ఫైనల్స్‌కు వరుణుడి ముప్పు ఉంటుందని వాతవరణ శాఖ సూచిస్తోంది. అయితే అడపాదడపా వర్షం పడినప్పటికీ.. మ్యాచ్ రద్దు అయ్యే పరిస్థితులు చాలా తక్కువగానే ఉన్నాయట. ఒకవేళ ఇవాళ పూర్తిస్థాయి మ్యాచ్ నిర్వహించేందుకు అనుకూలంగా లేకపోయినప్పటికీ.. రిజర్వ్‌డే ఉండటం వల్ల ఇరు జట్లకు కాస్త ఊరట లభిస్తుంది. అయితే ఆసియా కప్ చరిత్రలో ఇప్పటి వరకు ఫైనల్స్‌లో భారత్-శ్రీలంక జట్లు ఎనిమిది సార్లు తలపడ్డాయి. అందులో టీమ్‌ఇండియా ఐదుసార్లు విజేతగా నిలిచింది. మిగిలిన మూడుసార్లు శ్రీలంక టైటిల్ సొంతం చేసుకుంది. దీంతో ఈసారి ఎవరు విజేతగా నిలుస్తారో అన్న ఉత్కంఠ అభిమానుల్లో మొదలైంది. ఈ క్రమంలో ఈ రోజు వాతావరణ పరిస్థితి ఎలా ఉండనుందో ఓ సారి తెలుసుకుందాం. ప్రస్తుతమైతే కొలంబో వాతావరణం కాస్త పొడిగానే ఉంది. వర్షం పడే అవకాశాలు కూడా చాలా తక్కువ. ఇక తేమశాతం కూడా 65% మాత్రమే ఉంది.
ఒక్కో గంటకు ఇలా..
- మధ్యాహ్నం 1 గంటకు: ఈ సమయంలో కాస్త వర్షం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 66 శాత పడనుందని సమాచారం. ఈ క్రమంలో మెరుపులతో చిరుజల్లులు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తేమశాతం 76కి పెరుగుతుంది.
- 2 గంటలు: మళ్లీ చినుకులు పడటం ఆగిపోయి వాతావరణం సాధారణ స్థితికి రావచ్చు. ఆ సమయంలో ఉష్ణోగ్రత కూడా 30 డిగ్రీలుగా ఉండనుంది. ఇక వర్షం పడేందుకు 49 శాతం అవకాశం ఉంది.
- 3 గంటల నుంచి 5 గంటల వరకు: టాస్ వేసే సమయంలో ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. మధ్యాహ్నం 2.30 గంటలకు టాస్ వేస్తారు. వాతావరణం పొడిగానే ఉండొచ్చు. అక్కడక్కడా మబ్బులు కూడా కనిపిస్తాయి. వర్షం పడే అవకాశాలు కూడా 49 శాతం మాత్రమే. సాయంత్రం 5 గంటల వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
- 6 గంటలు: మరోసారి వాన పడే అవకాశం ఉండనుందని వాతావరణ శాఖ సమాచారం. ఈ సమయంలో వర్షం పడే అవకాశాలు 61 శాతంగా ఉందట. తేమ శాతం కూడా 87గా నమోదైంది. అయితే, ఆ సమయంలో కాసేపు మాత్రమే వాన పడొచ్చు.
- రాత్రి 7 గంటలు: సాయంత్రం 6 గంటల నుంచి పడే వాన త్వరగా ఆగిపోతే మాత్రం మ్యాచ్ మళ్లీ ప్రారంభమౌతుంది. అయితే రాత్రి 7 గంటల సమయంలో వాన ఉండకపోవచ్చు. అప్పుడు వాతావరణంలో తేమ శాతం 86గా ఉంటుందట. దీంతో వర్షం పడే అవకాశం 49 శాతంగానే ఉంది.
- 8 గంటలు: మళ్లీ వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. వర్షం పడే అవకాశం 57 శాతంగా ఉంది. అప్పటికి ఎక్కువగా వాన లేకపోతే మ్యాచ్‌ను తిరిగి ప్రారంభించడానికి పెద్దగా సమయం తీసుకోరు.
- 9 గంటలు: ఈ సమయానికి పెద్దగా వర్షం ఉండదు. కానీ, అంతకుముందు కురిసే వాన పరిస్థితిపైనే ఈ మ్యాచ్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పటికి మేఘావృతమై ఉన్నప్పటికీ వర్షం వచ్చేందుకు 49 శాతం మాత్రమే ఛాన్స్ ఉంది.
- 10 గంటలు: ఈసారి మాత్రం వర్షం పడే అవకాశం దాదాపు 66 శాతంగా కనిపిస్తోంది. కాస్త ఎక్కువగానే వర్షం పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మ్యాచ్ పునఃప్రారంభానికి ఇదే సమయం కీలకం. ఈ సమయంలో ఎంత తీవ్రంగా వర్షం పడుతుందో చూసి దానిని బట్టి మ్యాచ్‌న రిజర్వ్‌డేకు వాయిదా వేస్తారు.
- 11 గంటలు: వాతావరణ శాఖ నివేదికను బట్టి ఈ సమయానికి వర్షం తగ్గినా.. మ్యాచ్ నిర్వహణకు అనువైన పరిస్థితులు ఉంటాయా లేదా అనేది అనుమానమే. ఒక వేళ పిచ్ సిద్ధం కాకపోతే మాత్రం మ్యాచ్‌ను రిజర్వ్‌డేకు వాయిదా వేసి.. మిగతా మ్యాచ్‌ను సోమవారం నిర్వహిస్తారు.