Team India: రోహిత్ శర్మ టీమ్‌ఇండియా కెప్టెన్‌గా నియమితుడయ్యాక భారత్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ముఖ్యంగా గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత ఈ ఫార్మాట్‌లో ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. న్యూజిలాండ్,వెస్టిండీస్, శ్రీలంక జట్లపై 3-0 తేడాలతో ఎదురులేని ఆధిపత్యం చెలాయించింది. దీంతో హిట్‌మ్యాన్‌పై భారీ అంచనాలు పెరుగుతున్నాయి. అతడే సరైన నాయకుడంటూ ఇప్పటికే పలువురు అభిమానులు మురిసిపోతున్నారు. అయితే, టీమ్‌ఇండియా ప్రస్తుతం ఇంత అద్భుతంగా సాగుతున్నా.. భవిష్యత్‌లో జట్టులో ఎదురవనున్న కొత్త సవాళ్లు ఆందోళన కలిగిస్తున్నాయి.
కచ్చితమైన ఓపెనింగ్ పెయిర్..
భారత్ 2021 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లతో ఓటముల తర్వాత వరుసగా 12 విజయాలు సాధించింది. దీంతో ఈ ఫార్మాట్‌లో వరుసగా అత్యధిక విజయాలు సాధించిన అఫ్గానిస్థాన్, రొమేనియా జట్ల సరసన నిలిచింది. అలాగే ఈ 12 మ్యాచ్‌ల్లో ఆడిన ఒకే ఒక్క ఆటగాడు కెప్టెన్ రోహిత్ శర్మ. అయితే, ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్నా అతడికి కచ్చితమైన ఓపెనింగ్ జోడీ లేకపోవడం ఇప్పుడు కాస్త ఆందోళనకు గురి చేస్తోంది. కేఎల్ రాహుల్ లేదా ఇషాన్ కిషన్ ఎవరు అందుబాటులో ఉంటే వాళ్లతో హిట్‌మ్యాన్ బరిలోకి దిగుతున్నాడు. ఆటగాళ్ల గాయాల కారణంగానే ఇలా జరుగుతున్నా.. రోహిత్‌కు కచ్చితమైన ఓపెనింగ్ పెయిర్ ఒకరు ఉంటే కాస్త స్థిరత్వం ఉంటుంది.
నంబర్ 3లో ఆ ముగ్గురు..
ఇంతకుముందు వరకు టీమ్‌ఇండియాలో నంబర్ 3 ఆటగాడంటే విరాట్ కోహ్లీనే. అయితే, ఇటీవలి కాలంలో పొట్టి ఫార్మాట్‌లో సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్ ఆ స్థానాన్ని కైవసం చేసుకునేలా కనిపిస్తున్నారు. అవకాశం చిక్కినప్పుడల్లా బ్యాట్‌తో రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా కోహ్లీ కన్నా దూకుడైన ఆట తీరుతో అదరగొడుతున్నారు. గతేడాది శ్రేయస్ గాయపడటం వల్ల అవకాశం దక్కించుకున్న సూర్యకుమార్ తనదైనశైలిలో మెరుపులు మెరిపిస్తున్నాడు.
ఇక శ్రేయస్ సైతం ఇటీవల దంచికొట్టుడే పనిగా పెట్టుకున్నాడు. తాజాగా శ్రీలంకతో ఆడిన టీ20 సిరీసే అందుకు నిదర్శనం. మూడు మ్యాచ్‌ల్లోనూ కోహ్లీ స్థానంలో బరిలోకి దిగిన అతడు మూడింట్లోనూ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్సులు ఆడాడు. దీంతో అతడు కూడా ఈ స్థానానికి పోటీ పడుతున్నాడు. ఇక కోహ్లీ తిరిగి జట్టులోకి వస్తే సూర్య, శ్రేయస్ ఏయే స్థానాల్లో ఆడతారో చూడాలి.