Ind vs SL Asian Games :ఆసియా క్రీడల్లో భాగంగా శ్రీలంకతో జరిగిన పోరులో భారత మహిళల జట్టుదే పైచేయి సాధించింది. లక్ష్యఛేదనలో లంక జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 97 పరుగులను మాత్రమే చేయగలిగింది. 117 లక్ష్యంతో బరిలోకి దిగిన లంక సేన.. భారత బౌలర్ల దాటికి నిలవలేకపోయింది. దీంతో టీమ్ఇండియా 19 పరుగుల తేడాతో శ్రీలంకపై నెగ్గి క్రికెట్ చరిత్రలో తొలి స్వర్ణ పతకం సాధించింది.
18 ఏళ్ల పేసర్ టిటాస్ సాధు.. చమరి ఆటపట్టు (12), అనుష్క సంజీవని (1), విష్మి గుణరత్నే (0)లను వరుస ఓవర్లలో ఔట్ చేసి శ్రీలంకకు గట్టి షాక్ ఇచ్చింది. దీంతో లంక తొలి 14 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత రంగంలోకి దిగిన హాసిని పెరీరా (25), నీలాక్షి డి సిల్వా (23), ఓషది రణసింగ్ (19) ఆదుకున్నప్పటికీ.. తమ స్కోర్లతో జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. ఇక భారత బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ 2 వికెట్లు పడగొట్టగా.. పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ, దేవిక వైద్య చెరో వికెట్ను తమ ఖాతాలో వేసుకున్నారు.
Ind Women Vs SL Women : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. స్మృతి మంధాన (46), జెమీమా రోడ్రిగ్స్ (42) రాణించారు. ఇక షెఫాలీ వర్మ (9), హర్మన్ ప్రీత్ కౌర్ (2), రిచా ఘోష్ (9) నిరాశపరిచారు. స్పిన్ ట్రాక్ పై లంక అమ్మాయిలు అదరగొట్టారు. అయితే కట్టుదిట్టంగా బౌలింగ్ వేసి.. టీమ్ఇండియా భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు. లంక బౌలర్లలో ఇనోకా, సుగంధిక, ప్రభోదని తలో రెండు వికెట్లు తీసి సత్తా చాటారు.