మూడు టీ20ల సిరీస్‌లో తలో మ్యాచ్ గెలుచుకున్న భారత్, శ్రీలంక.. శనివారం సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే మూడో టీ20లో తలపడబోతున్నాయి. కోహ్లి, రోహిత్, రాహుల్, షమి, భువనేశ్వర్ లాంటి సీనియర్లు దాదాపుగా టీ20 జట్టుకు దూరమైన స్థితిలో.. కొత్త కెప్టెన్ హార్దిక్ నాయకత్వంలో, ఎక్కువగా కుర్రాళ్లతో నిండిన జట్టు ఎలాంటి ప్రదర్శన చేస్తుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొనగా.. తొలి రెండు టీ20ల్లో యువ భారత్ ఆట ఆకట్టుకోలేదు. రెండు మ్యాచ్‌ల్లోనూ ఒక దశ తర్వాత బౌలింగ్ పూర్తిగా అదుపు తప్పింది. టాప్‌ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రెండుసార్లూ చేతులెత్తేశారు. వన్డేల ముంగిట ఈ మ్యాచ్ నెగ్గి టీ20 సిరీస్‌ను సాధించడం ఇరు జట్లకూ చాలా అవసరం కాబట్టి విజయం కోసం గట్టిగానే పోరాడతాయనడంలో సందేహం లేదు.
అర్ష్‌దీప్‌పై ఆందోళన : రెండో టీ20లో భారత బౌలర్ల ప్రదర్శన జట్టు యాజమాన్యాన్ని కంగారు పెట్టే ఉంటుంది. ముఖ్యంగా ప్రస్తుతం జట్టులో ప్రధాన పేసర్‌గా ఉన్న అర్ష్‌దీప్.. పూర్తిగా అదుపు తప్పడం, ఏకంగా 5 నోబాల్స్ వేయడం ఆందోళన రేకెత్తించేదే. కెరీర్ ఆరంభమయ్యాక ఆరు నెలల్లోనే టీ20ల్లో అతను 14 నోబాల్స్ వేయడం గమనార్హం. ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ.. రనప్, బంతి మీద నియంత్రణ లేకుంటే కష్టం. కాబట్టి అర్ష్‌దీప్‌ను వెంటనే దారిలో పెట్టాల్సిందే.
ఆఖరి ఓవర్లలో.. : రెండో టీ20లో అర్ష్‌దీప్ మాత్రమే కాదు.. మిగతా బౌలర్లు చివరి ఓవర్లలో పూర్తిగా తేలిపోయారు. లంక ఏకంగా 200 పైచిలుకు స్కోరు చేయడం బౌలింగ్ డొల్లతనాన్ని తెలియజేసేదే. ఉమ్రాన్ మాలిక్ కొన్ని మెరుపు బంతులేస్తున్నా, వికెట్లు పడగొడుతున్నా.. ధారాళంగా పరుగులిచ్చేస్తున్నాడు. తొలి టీ20లో మెరిసిన మావి.. రెండో మ్యాచ్‌లో తేలిపోయాడు. సీనియర్ స్పిన్నర్ చాహల్ ప్రదర్శన పడిపోయింది.