కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా టీమ్ఇండియా, శ్రీలంక మధ్య చివరి వన్డే శుక్రవారం జరగనుంది. ఇప్పటికే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది ధావన్ సేన. అయితే.. మూడు వన్డేల సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో లంకేయులు నిర్దేశించిన మోస్తరు లక్ష్యాన్ని టీమ్‌ఇండియా ఊదిపారేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్ సమయోచిత ఇన్నింగ్స్ ఆడగా కుర్రాళ్లు పృథ్వీషా, ఇషాన్ కిషన్ దుమ్మురేపారు. దూకుడుగా ఆడి త్వరగా విజయం అందించారు. రెండో మ్యాచులో మాత్రం వీరికి సవాళ్లు ఎదురయ్యాయి. 65 పరుగులకే ఈ ముగ్గురూ వెనుదిరిగారు. క్లిష్ట పరిస్థితుల్లో సూర్యకుమార్ యాదవ్, మనీశ్ పాండే, దీపక్ చాహర్, క్రునాల్ పాండ్య ఒత్తిడికి నిలిచారు. వెంటవెంటనే వికెట్లు కోల్పోయినా.. దీపక్ చాహర్ తన అద్భుత బ్యాటింగ్‌తో లంకేయుల ఆశలను చిదిమేశాడు. మూడో వన్డేలోనూ లంకేయుల నుంచి ప్రతిఘటన ఎదురవ్వొచ్చు.
ఓపెనర్ ఎవరు?
మూడో వన్డేలో గబ్బర్‌సేనలో మార్పు చేర్పులు స్పష్టం! గబ్బర్‌తో పాటు మరో కొత్త ఓపెనర్ బరిలోకి దిగొచ్చు. పృథ్వీ షా (43, 13) స్థానంలో దేవదత్ పడిక్కల్, రుత్‌రాజ్ గైక్వాడ్‌లో ఒకరికి అవకాశం దక్కొచ్చు. టీ20 ప్రపంచకప్‌నకు షాను దృష్టిలో పెట్టుకుంటే మాత్రం తప్పించడం కష్టం. ఫస్ట్‌క్లాస్‌లో మాత్రం పడిక్కల్, రుతురాజ్‌కు మంచి అనుభవం ఉంది. పరుగుల వరద పారించారు. మిడిలార్డర్లో మనీశ్ పాండే, సూర్యకుమార్ యాదవ్ జట్టుకు వెన్నెముక. పైగా సమయోచితంగా ఆడుతున్నారు. వికెట్ కీపర్‌గా కిషన్ బదులు సంజు శాంసన్ వస్తే ఆశ్చర్యమేం లేదు. పైగా ద్రవిడ్‌కు అతడిపై గురి ఎక్కువే.
సకారియా అరంగేట్రం చేస్తాడా?
ఫిట్‌నెస్ ఇబ్బందులేం లేవు కాబట్టి హార్దిక్ పాండ్యకు చోటు ఖాయమే. టీ20 సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుంటే విశ్రాంతినివ్వొచ్చు. క్రునాల్ పాండ్యను జట్టులోంచి తప్పించలేని స్థితి. మణికట్టు మాంత్రికులు కుల్‌దీప్ (2/48, 0/55), యూజీ (2/52, 3/50) అదరగొట్టారు. పొట్టి క్రికెట్ నేపథ్యంలో వీరి స్థానంలో రాహుల్ చాహర్, కృష్ణప్ప గౌతమ్‌ను ఆడించొచ్చు. ఇప్పుడు భువీతో దీపక్ చాహర్ పేస్ బాధ్యతలు పంచుకుంటున్నాడు. అతడి స్థానంలో నవదీప్ సైనీని ఆడిస్తారా? ఎడమచేతి వాటం పేసర్ చేతన్ సకారియాతో అరంగేట్రం చేయిస్తారా చూడాలి! నకుల్ బంతులు వేయడంలో దిట్టైన దీపక్‌కు విశ్రాంతినివ్వడం తప్పదనే తెలుస్తోంది.
ఆత్మవిశ్వాసంతో వెళ్తారా?