IND vs SL 2nd Test: డే/నైట్ టెస్టుల్లో టీమ్ఇండియాకు చాలా తక్కువ అనుభవముందని వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అన్నాడు. పింక్ బాల్(గులాబీ) టెస్టులో ఆడేందుకు ఆటగాళ్లు మానసికంగా కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. రేపటి (మార్చి 12) నుంచి శ్రీలంకతో జరుగనున్న రెండో టెస్టు మ్యాచు ముందు నిర్వహించిన వర్చువల్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన బుమ్రా.. పలు విషయాలు వెల్లడించాడు.
"మేం పింక్ బాల్ టెస్టులు ఎక్కువగా ఆడలేదు. ఇప్పటి వరకు ఆడిన మూడు డే/నైట్ టెస్టులు కూడా భిన్న పిచ్‌లపై ఆడినవే. పరిస్థితులను బట్టి వివిధ రకాల వ్యూహాలను అమలు చేశాం. అందుకే పిచ్ పరిస్థితులకు తగ్గట్టుగా ఆటగాళ్లు మానసికంగా సంసిద్ధం కావాల్సి ఉంది. పింక్ బాల్ టెస్టుల్లో ఫీల్డింగ్ చేయడం కొంచెం భిన్నంగా ఉంటుంది. మనం అనుకున్న దాని కంటే బంతి వేగంగా దూసుకొస్తుంది. టెస్టు క్రికెట్లో సాధారణంగా ఉదయం పూట బంతి బాగా స్వింగ్ అవుతుంది. మధ్యాహ్నం సమయానికి కాస్త నెమ్మదిస్తుంది. మళ్లీ సాయంత్రం వేళ బాగా స్వింగ్ అవుతుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి కూడా మేం చర్చించాం. గులాబీ టెస్టుల్లో మాకున్న కొద్ది అనుభవంతో పాటు గత మ్యాచుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుని మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తాం"
-జస్ప్రీత్ బుమ్రా, టీమ్‌ఇండియా వైస్ కెప్టెన్
ఎవరెవరిని తీసుకుంటామంటే.?
"తుదిజట్టు కూర్పు ఎలా ఉంటుందనే విషయంపై ఇప్పుడే ఏం చెప్పలేను. పిచ్ పరిస్థితులను బట్టి ఎవరెవరిని జట్టులోకి తీసుకోవాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటాం. గత సిరీస్‌లో కూడా అక్షర్ పటేల్‌కి చోటు దక్కింది. అతడిని తుది జట్టులోకి తీసుకుంటే మరింత బలోపేతమవుతాం. ఆల్ రౌండర్‌గా మెరుగైన ప్రదర్శన చేయగలడు. ప్రస్తుతం అతడు గాయం నుంచి కోలుకుని అందుబాటులోకి వచ్చాడు. అతడు మా జట్టుకి విలువైన ఆటగాడు. అలాగే, తొలి టెస్టులో రవీంద్ర జడేజా అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అలాంటి ఆటగాడిని విశ్రాంతి పేరిట పక్కన పెట్టడం సరికాదు. జడేజా అదే ప్రదర్శనను మరోసారి పునరావృతం చేయాలని కోరుకుంటున్నాం" అని బుమ్రా చెప్పాడు. జయంత్ యాదవ్ స్థానంలో అక్షర్ పటేల్‌ని జట్టులోకి తీసుకునే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆటగాళ్ల శ్రేయస్సే ముఖ్యం..
"ప్రస్తుత పరిస్థితుల్లో ఆటగాళ్ల శ్రేయస్సే మాకు ముఖ్యం. ఎక్కువ కాలం బయో బబుల్‌లో ఉండటం అంత తేలికైన విషయం కాదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే కుల్దీప్ యాదవ్‌కి విశ్రాంతి ఇచ్చారనకుంటున్నాను. అతడు చాలా కాలంగా బయో బబుల్‌లో ఉంటూ జట్టుతో ప్రయాణిస్తున్నాడు. అతడిని తప్పించాల్సింది కాదు. అవకాశం వచ్చిన ప్రతి సారీ అతడు మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నించాడు. ఈ సిరీస్‌లో అతడికి అవకాశమే రాలేదు. ప్రస్తుతం అతడిని జట్టు నుంచి రిలీజ్ చేయడం వల్ల.. త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ ప్రారంభానికి ముందు అతడికి కుటుంబంతో గడిపేందుకు కాస్త సమయం దొరికినట్లైంది" అని బుమ్రా అన్నాడు.
శ్రీలంకతో జరుగనున్న రెండో టెస్టు టీమ్‌ఇండియాకు నాలుగో డే/నైట్ టెస్టు. గతంలో భారత జట్టు.. బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లతో తలో గులాబీ బంతి మ్యాచు ఆడింది. ఇందులో టీమ్‌ఇండియా రెండు మ్యాచుల్లో విజయం సాధించగా.. ఓ మ్యాచులో ఓటమి పాలైంది.
ఇదీ చదవండి:Ind vs Sl: అచ్చొచ్చిన స్టేడియంలోనైనా కోహ్లీ శతొక్కడతడా?