IND vs SA Tickets Booking Issue :2023 ప్రపంచకప్‌లో భాగంగా నవంబర్ 5న కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్ - సౌతాఫ్రికా మ్యాచ్ జరగనుంది. అదే రోజు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బర్త్‌డే కావడం విశేషం. అయితే మామూలుగానే మెగాటోర్నీలో భారత్ మ్యాచ్ అనగానే.. ఫుల్ క్రేజ్ ఉంటుంది. అందులోనూ విరాట్పుట్టినరోజున స్టేడియంలో తన బ్యాటింగ్ చూసే ఛాన్స్ వస్తుందంటే ఆ అవకాశాన్ని ఫ్యాన్స్ అస్సలు మిస్ అవ్వరు.
ఈ నేపథ్యంలోనే భారత్ - సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. అయితే నవంబర్ 5న మ్యాచ్టికెట్లు బుక్ చేస్తుంటే.. కన్ఫార్మ్ అవ్వడం లేదంటూ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో విస్తుపోయిన ఓ క్రికెట్ ఫ్యాన్ కోల్‌కతా, మైదాన్ పోలీస్ స్టేషన్లో ఈ విషయంపై ఫిర్యాదు చేశాడు. బీసీసీఐ సహా బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లైన బుక్‌మైషో(BOOK MY SHOW), క్యాబ్ (CAB) సక్రమంగా టికెట్ల అమ్మకాలు జరపడం లేదని.. వాటిని అధిక లాభాల కోసం బ్లాక్‌లో విక్రయిస్తున్నారని ఆ అభిమాని ఆరోపించాడు.
ఇక ఈ విషయాన్ని పరిశీలించిన మైదాన్ పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా నవంబర్ 2న బుక్‌మైషో, క్యాబ్ సంస్థ నిర్వాహకులను విచారణకు పిలిచినట్లు సమాచారం. కానీ, అటు బుక్‌మైషో, ఇటు బీసీసీఐ ఈ విషయంపై ఇప్పటివరకూ అధికారికంగా స్పందించలేదు.