Team India Cape Town Record: భారత్-దక్షిణాఫ్రికా మధ్య మూడో టెస్టుకు రంగం సిద్ధమైంది. మంగళవారం నుంచి ఇరుజట్ల మధ్య కేప్‌టౌన్ వేదికగా ఈ చివరి టెస్టు జరగనుంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే చెరో మ్యాచ్ గెలిచిన ఇరుజట్లు.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తున్నాయి. విరాట్ కోహ్లీ రాకతో బలంగా మారిన భారత జట్టును సఫారీసేన ఏమేరకు అడ్డుకుంటుందో చూడాలి. అలాగే ఈ మ్యాచ్ జరగబోయే కేప్‌టౌన్‌లో ఇప్పటివరకు ఒక్క టెస్టు మ్యాచ్ గెలవలేదు టీమ్ఇండియా. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ జరగబోయే ఈ మైదానంలో భారత జట్టు రికార్డు ఎలా ఉందో చూద్దాం.
ఇప్పటివరకు కేప్‌టౌన్ మైదానంలో భారత్ ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడగా.. ఇందులో రెండు డ్రాగా ముగియగా.. మూడు మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
1992-93 డ్రా
భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలిసారి కేప్‌టౌన్ వేదికగా టెస్టు మ్యాచ్ జరిగింది. 1992-93 సీజన్లో జరిగిన ఈ సిరీస్‌ను 1-0 తేడాతో చేజిక్కించుకుంది సౌతాఫ్రికా. ఈ టూర్లో చివరిదైన నాలుగో టెస్టు కేప్‌టౌన్ వేదికగా జరిగింది. అయితే ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.
1997 - దక్షిణాఫ్రికా విజయం
1997లో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో టెస్టు కేప్‌టౌన్ వేదికగా జరిగింది. అప్పటికే మొదటి టెస్టును 328 పరుగుల తేడాతో గెలుచుకుని జోరుమీదున్న సఫారీసేన.. రెండో టెస్టులోనూ ఘనవిజయం సాధించింది. 282 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్‌లో సచిన్, అజారుద్దీన్ నెలకొల్పిన 222 పరుగుల భాగస్వామ్యం అందరినీ ఆకట్టుకుంది. తెందూల్కర్ 169 పరుగులతో సత్తాచాటగా, అజారుద్దీన్ 115 పరుగులు సాధించాడు.
2007 - దక్షిణాఫ్రికా విజయం
2006-07 పర్యటన భారత్‌కు మధుర జ్ఞాపకాల్ని అందించిందని చెప్పవచ్చు. ఈ టూర్లో భాగంగా జరిగిన తొలి టెస్టులో సఫారీసేనపై గెలిచిన టీమ్ఇండియా.. దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి ఓ టెస్టు మ్యాచ్ విజయం సాధించింది. కానీ ఆ తర్వాత బలంగా పుంజుకున్న సౌతాఫ్రికా.. డర్బన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో విజయంతో సిరీస్‌ను సమం చేసింది. ఇక చివరిదైన మూడో టెస్టు కేప్‌టౌన్ వేదికగా జరగగా.. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 5 వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్ కైవసం చేసుకుంది. ఈ టెస్టులో సెంచరీ బాదిన వసీం జాఫర్.. సౌతాఫ్రికా గడ్డపై శతకం చేసిన తొలి భారత ఓపెనర్‌గా రికార్డు సృష్టించాడు.
2011 - డ్రా
ఈ పర్యటనలో దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ గెలిచే అవకాశాన్ని టీమ్ఇండియా తృటిలో చేజార్చుకుంది. మూడు టెస్టుల సిరీస్‌లో డర్బన్ వేదికగా జరిగిన మ్యాచ్‌ను గెలిచిన ధోనీసేన.. కేప్‌టౌన్‌లో జరిగిన మూడో టెస్టులో విజయం దిశగా దూసుకెళ్లింది. కానీ రెండో ఇన్నింగ్స్‌లో వీరోచిత శతకంతో మ్యాచ్‌ను డ్రాగా ముగించాడు సౌతాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ జాక్వెస్ కలిస్. ఇదే టెస్టులో సెంచరీ (146) బాదిన సచిన్‌కు ఈ ఫార్మాట్లో ఇదే చివరి శతకం కావడం విశేషం. స్టెయిన్, మోర్నే మోర్కెల్ లాంటి పేసర్లను ఎదుర్కొంటూ సచిన్ చేసిన శతకం విమర్శకుల చేత చప్పట్లు కొట్టించింది.
2018 - దక్షిణాఫ్రికా విజయం
ఈ పర్యటనలో తొలి టెస్టును కేప్‌టౌన్ వేదికగా ఆడింది టీమ్ఇండియా. స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా ఈ మ్యాచ్ ద్వారానే టెస్టు అరంగేట్రం చేశాడు. ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికాను 286 పరుగులకే కట్టడి చేసిన భారత్.. తన మొదటి ఇన్నింగ్స్‌లో 97 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ ఆల్‌రౌండర్ బుమ్రా 95 బంతుల్లో 93 పరుగులతో భారత్‌ను గట్టెక్కించాడు. తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో సఫారీసేనను 130 పరుగులకే ఆలౌట్ చేసిన టీమ్ఇండియా.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించే అవకాశాన్ని చేజిక్కించుకుంది. కానీ భారత బ్యాటర్లు విఫలమవడం వల్ల 135 పరుగులకే ఆలౌటై 72 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.