IND vs SA Test: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీ (18) విఫలమవ్వడం అభిమానులను నిరాశకు గురిచేసింది. అతడి నుంచి అభిమానులు భారీ ఇన్నింగ్స్ ఆశిస్తుండగా ఎప్పటిలాగే తక్కువ స్కోరుకు ఔటయ్యాడు. నాలుగో రోజు ఆటలో కోహ్లీ భోజన విరామం అనంతం తొలి బంతికే ఔటయ్యాడు. మార్కో జాన్సన్ బౌలింగ్‌లో వికెట్లకు దూరంగా వెళ్తున్న బంతిని ఆడేందుకు ప్రయత్నించి కీపర్ క్వింటన్ డికాక్ చేతికి చిక్కాడు. దీనిపై మాజీ సారథి సునీల్ గావస్కర్ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. కోహ్లీ మదిలో మరో ఆలోచన ఉన్నట్లు చెప్పాడు.
Sunil Gavaskar on Virat Kohli: 'కోహ్లీ ఆడింది సరైనా షాట్ కాదు అని చెప్పొచ్చు. ఎవరైనా విరామం తీసుకొని వచ్చాక కొద్దిసేపు నిలకడగా ఆడతారు. ముఖ్యంగా టెస్టుల్లో.. క్రీజులో కదలిక, ఫుట్‌వర్క్ కోసం కొద్దిసేపు వేచిచూస్తారు. చివరికి డ్రింక్స్ విరామం పూర్తయ్యాక కూడా.. ఏ బ్యాట్స్‌మెన్ అయినా షాట్లు ఆడరు. అలాంటిది ఎంతో అనుభవజ్ఞుడైన కోహ్లీ లాంటి ఆటగాడు ఇలా తొలి బంతినే షాట్ ఆడాడంటే.. అతడి మదిలో వేరే ఆలోచన ఉండి ఉంటుంది. త్వరగా పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేద్దామనుకొని ఉండొచ్చు. అతడు ఔటైన బంతి వికెట్లకు దూరంగా వెళుతోంది. అలాంటప్పుడు దాన్ని వదిలేయాల్సింది' అని గావస్కర్ ఓ క్రీడా ఛానెల్లో అభిప్రాయపడ్డాడు.
మరోవైపు కోహ్లీ రెండో ఏడాది కూడా సెంచరీ నమోదు చేయకుండా వెనుదిరగడంపై క్రికెట్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.