Ind vs SA series spectators: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్లో తలపడేందుకు టీమ్ఇండియా సిద్ధమవుతోంది. డిసెంబర్ 26న సెంచూరియన్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. అయితే ఆ దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తున్న దృష్ట్యా.. ఈ సిరీస్ నిర్వహణకు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య జరగబోయే తొలి, రెండో టెస్టును ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని వారు భావిస్తున్నారని తెలుస్తోంది. అందుకోసమే టికెట్లు కూడా అమ్మకానికి పెట్టలేదని సమాచారం.
ప్రేక్షకులు లేకుండానే భారత్-దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్! - భారత్-దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ ప్రేక్షకులు
Ind vs SA series spectators: టీమ్ఇండియాతో జరగబోయే టెస్టు సిరీస్‌ను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని చూస్తోంది సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
"ప్రస్తుతానికైతే వచ్చే ఏడాది జనవరి 03 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టుకు సంబంధించిన టికెట్లను విక్రయించడం లేదు. ‘దయచేసి గమనించండి. రెండో టెస్టుకు సంబంధించి టికెట్ల విక్రయాలపై ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతిస్తారా?, లేదా? అనే విషయంలో స్పష్టత లేదు. ఈ విషయంపై నిర్ణయాన్ని తర్వాత వెల్లడిస్తాం" అని దక్షిణాఫ్రికా క్రికెట్ వర్గాలు తెలిపాయి.
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య డిసెంబర్ 26 (బాక్సింగ్ డే) నుంచి తొలి టెస్టు ప్రారంభమవుతుంది. ఇప్పటికే విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టెస్టు జట్టు దక్షిణాఫ్రికాలో అడుగు పెట్టింది. టెస్టు సిరీస్ కోసం ఆటగాళ్లు కఠినంగా సాధన చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆఫ్రికా గడ్డ మీద ఒక్క సిరీస్‌ను గెలుచుకోని టీమ్‌ఇండియా.. చరిత్ర తిరగరాయాలని భావిస్తోంది. తొలి టెస్టు డిసెంబర్ 26-30, రెండో టెస్టు జనవరి 03-07, ఆఖరి టెస్టు జనవరి 11-15 వరకు జరుగుతుంది. జనవరి 19, 21, 23వ తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి.