IND Vs SA Test Series :సఫారీ గడ్డపై తొలి టెస్ట్ గెలిచి చరిత్ర తిరగరాయాలన్న లక్ష్యంతో దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టింది టీమ్ఇండియా. కానీ సిరీస్‌ను డ్రా చేసుకుని టార్గెట్ ఛేదించకుండానే వెనుదిరిగింది. ముఖ్యంగా తొలి టెస్టులో ఇన్నింగ్స్ పరాజయం తర్వాత రెండో టెస్టును రోజున్నర ఆటలోనే ముగించడం గొప్ప విషయమే. కానీ కల మాత్రం నెరవేరలేదు. సిరీస్ డ్రా చేశామన్న ఆనందం మిగిలింది. అయినా కలగన్న విజయం అందుకునేందుకు టీమ్ఇండియా ప్రయత్నం సరిపోలేదు. ఈ సిరీస్‌తో భారత బలహీనతలు మరోసారి బయటపడ్డాయి. కొన్ని కొత్త ప్రశ్నలు తలెత్తాయి. రెండు టెస్టుల్లోనూ భారత బ్యాటింగ్ ప్రదర్శన పేలవంగా సాగడం ఆందోళన కలిగించే విషయమే. మొదటి టెస్టులో బౌలర్లు విఫలమైనా, రెండో మ్యాచ్‌లో విజృంభించారు. 1992 నుంచి ఇప్పటివరకూ దక్షిణాఫ్రికాలో తొమ్మిది టెస్టు సిరీస్‌లు ఆడిన భారత్, రెండు సార్లు (2010-11, 2023-24) సిరీస్‌లు మాత్రమే డ్రా చేసుకోగలిగింది. మిగతా ఏడు సార్లూ సఫారీల చేతిలో పరాజయం పాలైంది.
బలహీనత పోయేదెప్పుడు?
బౌన్సీ, పేస్, స్వింగ్ పిచ్‌లుండే విదేశాల్లో టీమ్ఇండియా బ్యాటర్ల తడబాటు కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో మరోసారి అంచనాలను అందుకోలేకపోయారు. తొలి టెస్టులో కేఎల్ రాహుల్ శతకం, రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి అర్ధసెంచరీ తప్ప బ్యాటింగ్‌లో చెప్పుకోవడానికి ఏం లేదు. ఇక రెండో టెస్టులో బౌలర్ల ప్రదర్శనతోనే జట్టు గట్టెక్కింది. లేకుంటే మరో ఓటమి భారత్ ఖాతాలో పడేది. ముఖ్యమంగా దక్షిణాఫ్రికా లాంటి దేశాల్లో పరిస్థితులు మన బ్యాటర్లకు సవాలు విసురుతాయి. కానీ అందుకు తగ్గట్లుగా మానసికంగా, ఆట పరంగా సిద్ధం కావడం అవసరం. అలవాటు పడేందుకు అక్కడి దేశవాళీ జట్లతో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడాలి. కానీ భారత్ అలా కాకుండా తమ ఆటగాళ్లనే రెండు జట్లుగా విభజించుకుని ఓ వార్మప్ మ్యాచ్ ఆడింది. కానీ ఇలాంటి పద్ధతుల వల్ల ఒరిగేదేం ఉండదు.
దక్షిణాఫ్రికా వంటి పిచ్‌ల్లో బ్యాటింగ్ ఎలా చేయాలో రాహుల్, కోహ్లి, ఎల్గర్, మార్‌క్రమ్ చూపించారు. ముందు ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కుంటామనే ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆఫ్‌స్టంప్ ఆవల పడే బంతుల పట్ల ఓపికగా ఉండాలి. బౌన్సర్లను వదిలేయడంలో పరిణతి చూపించాలి. కానీ యంగ్ ప్లేయర్లు యశస్వి, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ ఈ విషయంలో కొన్ని పొరపాట్లు చేశారు. ఓపెనింగ్ స్థానం కోసం తీవ్రమైన పోటీ నెలకొంగి. ఈ నేపథ్యంలో తన బ్యాటింగ్‌ను మరింత మెరుగుపర్చుకోకపోతే యశస్వికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక పుజారా, రహానె స్థానాలను భర్తీ చేయడం అంత సులువు కాదని శుభ్‌మన్, శ్రేయస్‌కు ఈపాటికి తెలిసొచ్చే ఉంటుంది. వాళ్లు పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగితే భవిష్యత్తులో గొప్ప టెస్ట్ ప్లేయర్లు కావచ్చు.
బౌలింగ్‌లోనూ అంతే!
మొదటి టెస్టులో పేస్‌కు అనుకూలమైన పరిస్థితుల్లో మన ఫాస్ట్‌బౌలర్లు విఫలమయ్యారు. బుమ్రా 4, సిరాజ్ 2 వికెట్లు తీయగాల శార్దూల్, ప్రసిద్ధ్ కృష్ణ పేస్ పిచ్‌పై ఆకట్టుకోలేకపోయారు. ఈ మ్యాచ్‌లో షమీ లేని లోటు స్పష్టంగా కనిపించింది. దీంతో టీమ్ఇండియా బౌలింగ్ రిజర్వ్ బెంచ్ బలంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. టెస్టు అవసరాలకు అనుగుణంగా యువ పేసర్లను తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. రెండో టెస్టులో ఎంట్రీ ఇచ్చిన ముకేశ్ బంతితో ఆకట్టుకున్నాడు.
మరోవైపు పేస్ ఆల్‌రౌండర్ లేకపోవడం కూడా జట్టుకు సమస్యగా మారింది. తొలి టెస్టులో ఆడిన శార్దూల్ న్యాయం చేయలేకపోయాడు. హార్దిక్ పాండ్య కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్‌పైనే దృష్టి పెడుతున్నాడు. దీంతో టెస్టుల్లో ఆ బాధ్యతలు నిర్వర్తించాల్సిన ఆల్‌రౌండర్ జట్టుకు అవసరం. ఆ దిశగా సెలెక్టర్లు అన్వేషణ సాగాలి. ఇక టేయిల్ ఎండ్‌లో కాస్త బ్యాటింగ్ సామర్థ్యం ఉంటే జట్టుకు కలిసొస్తుంది. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగూ సాధించకుండా చివరి 6 వికెట్లు కోల్పోవడం టీమ్ఇండియా బ్యాటింగ్ డొల్లతనానికి నిదర్శనం. ఈ దక్షిణాఫ్రికా పర్యటన నుంచి పాఠాలు నేర్చుకుని టీమ్ఇండియా అన్ని విభాగాల్లో మెరుగుపడాలి. లేదంటే సఫారీలతో టెస్టు సిరీస్ గెలవాలనే కల ఎప్పటికీ కలగానే ఉండిపోతుంది.