తెలంగాణ

telangana

ETV Bharat / sports

Ind Vs SA Test: టీమ్​ఇండియాకు ఒకే ఒక ఆశ.. సఫారీ గడ్డపై ఈసారైనా? - Ind Vs SA

Ind Vs SA Test: న్యూజిలాండ్‌లో ఎప్పుడో గెలిచారు.. ఇంగ్లాండ్‌లోనూ విజయాలందాయి.. ఇటీవలి పర్యటనలో సిరీస్‌ దాదాపుగా సొంతమైంది. వెస్టిండీస్‌లో పెద్దగా కష్టపడకుండానే గెలిచేస్తున్నారు. ఆస్ట్రేలియాలో గత రెండు పర్యటనల్లోనూ సిరీస్‌ విజయాలు దక్కాయి. కానీ ఉపఖండం అవతల ఒక్క దేశంలో మాత్రం టీమ్‌ఇండియాకు టెస్టు సిరీస్‌ గెలుపు దశాబ్దాలుగా అందని ద్రాక్షే. ఆ దేశం దక్షిణాఫ్రికానే అని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దాదాపు మూడు దశాబ్దాలుగా సఫారీ గడ్డకు వెళ్తున్న టీమ్‌ఇండియాకు ప్రతిసారీ రిక్త హస్తమే ఎదురవుతోంది. మరి ఈసారైనా భారత జట్టు అక్కడ ఖాతా తెరుస్తుందా అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

INDIA TOUR OF SA
భారత్ దక్షిణాఫ్రికా

By

Published : Dec 21, 2021, 7:17 AM IST

Ind Vs SA Test: వర్ణ వివక్ష కారణంగా సుదీర్ఘ కాలం పాటు నిషేధాన్ని ఎదుర్కొని 90వ దశకంలో దక్షిణాఫ్రికా జట్టు క్రికెట్లోకి పునరాగమనం చేశాక 1992లో ఆ దేశంలో పర్యటించింది టీమ్‌ఇండియా. అప్పట్నుంచి 2018 పర్యటన వరకు మొత్తంగా ఏడుసార్లు దక్షిణాఫ్రికాలో సిరీస్‌లు ఆడితే.. ఒక్క 2010-11 సిరీస్‌ను మినహాయిస్తే అన్నింట్లోనూ భారత్‌కు పరాభవాలే ఎదురయ్యాయి. ఆ ఒక్క సిరీస్‌ను మాత్రం 1-1తో డ్రా చేసింది. మూడు టెస్టుల ఈ సిరీస్‌లో ధోనీ నాయకత్వంలో సచిన్‌, ద్రవిడ్‌, సెహ్వాగ్‌, గంభీర్‌, లక్ష్మణ్‌, జహీర్‌ ఖాన్‌, హర్భజన్‌ సింగ్‌లతో కూడిన మేటి జట్టు చక్కటి ప్రదర్శన చేసింది.

మరపురాని ఆ విజయం..

జహీర్‌ అందుబాటులో లేని తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ ఓటమి పాలైనప్పటికీ.. రెండో టెస్టులో పుంజుకొని సిరీస్‌ను సమం చేసింది భారత్‌. భారత క్రికెట్‌ చరిత్రలో చిరస్మరణీయమైన విజయాల్లో ఇదొకటి. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 205 పరుగులకే ఆలౌటైంది. కానీ హర్భజన్‌ (4/10), జహీర్‌ (3/36) విజృంభించడం వల్ల సఫారీ జట్టు అనూహ్యంగా 131 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో సఫారీ బౌలర్లు దెబ్బ కొట్టినా.. లక్ష్మణ్‌ (96) అసమాన పోరాటంతో భారత్‌ 228 పరుగులు చేసి, ప్రత్యర్థికి 303 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. జహీర్‌ (3/57), శ్రీశాంత్‌ (3/45) హర్భజన్‌ (2/70) సత్తా చాటడం వల్ల దక్షిణాఫ్రికా 215 పరుగులకే ఆలౌటైంది. భారత్‌ 87 పరుగుల అపురూప విజయాన్నందుకుంది. దక్షిణాఫ్రికాలో భారత్‌ ఆడిన 20 టెస్టుల్లో సాధించిన మూడు విజయాల్లో ఇదొకటి. ఈ సిరీస్‌ చివరి టెస్టు డ్రాగా ముగిసింది. సిరీస్‌లోనూ అదే ఫలితం వచ్చింది.

ఈ సిరీస్‌కు ముందు భారత్‌.. దక్షిణాఫ్రికాలో నాలుగుసార్లు పర్యటించింది. 1992లో తొలి సిరీస్‌లో (4 మ్యాచ్‌లు) 0-1తో, 1996లో మూడు టెస్టుల సిరీస్‌లో 0-2తో, 2001లో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-1తో భారత్‌ ఓడింది. 2006 పర్యటనలో భారత్‌ తొలి టెస్టు నెగ్గి కూడా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-2తో పరాజయం చవిచూసింది. శ్రీశాంత్‌ (మ్యాచ్‌ ప్రదర్శన 8/99) మెరుపు బౌలింగ్‌తో 123 పరుగుల తేడాతో తొలి టెస్టులో నెగ్గిన భారత్‌.. తర్వాత వరుసగా రెండు ఓటములు ఎదుర్కొంది. 2013 పర్యటనలో రెండు టెస్టులాడి ఒక మ్యాచ్‌ను డ్రా చేసుకుని, మరో మ్యాచ్‌లో ఓడి సిరీస్‌ను చేజార్చుకుంది.

ఇదీ చదవండి:ప్రేక్షకులు లేకుండానే భారత్-దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్!

బాగా ఆడినా..

టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికా పర్యటనల్లో 2018 సిరీస్‌ ప్రత్యేకం. మూడు టెస్టుల సిరీస్‌లో భారత్‌ 1-2తో ఓడింది. ఈ గణాంకం చూసి భారత్‌ పేలవ ప్రదర్శన చేసిందనుకుంటాం. కానీ కోహ్లీ నేతృత్వంలోని జట్టు సిరీస్‌లో ఓడినా తన ప్రదర్శనకు గర్వపడే ఉంటుంది.

  • కేప్‌టౌన్‌లో జరిగిన తొలి టెస్టులో భువనేశ్వర్‌ (4/87) సహా బౌలర్లందరూ రాణించడం వల్ల తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికాను భారత్‌ 286 పరుగులకే పరిమితం చేయగలిగింది. తర్వాత బ్యాటింగ్‌లో ఒక దశలో టీమ్‌ఇండియా 92 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో హార్దిక్‌ పాండ్య (93), భువనేశ్వర్‌ (25)ల అద్భుత పోరాటంతో పుంజుకుని 209 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత పేసర్లు బుమ్రా (3/39), షమీ (3/28), భువనేశ్వర్‌ (2/33), హార్దిక్‌ పాండ్య (2/27) చెలరేగిపోవడం వల్ల సఫారీ జట్టు 130 పరుగులకే కుప్పకూలింది. భారత్‌ ముందు 208 పరుగుల సాధించదగ్గ లక్ష్యమే నిలిచింది. కానీ కోహ్లీ (28), అశ్విన్‌ (37) మినహా ఎవరూ నిలవకపోవడం వల్ల బౌలర్ల శ్రమకు ఫలితం లేకపోయింది. భారత్‌ 135 పరుగులకే ఆలౌటై 72 పరుగుల తేడాతో ఓడింది.
  • సెంచూరియన్‌లో రెండో టెస్టులో భారత్‌ ఇంకా మెరుగ్గా ఆడింది. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 335 పరుగులకు ఆలౌట్‌ కాగా.. కోహ్లీ (153) మేటి ఇన్నింగ్స్‌ ఆడటం వల్ల భారత్‌ 307 పరుగులు చేయగలిగింది. షమీ (4/49) సహా బౌలర్లు రాణించడం వల్ల సఫారీ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 258 పరుగులకు ఆలౌటైంది. 287 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌.. 87 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. రోహిత్‌ (47), షమీ (28) పోరాడటం వల్ల 141/7తో భారత్‌ పుంజుకుంది. కానీ ఉన్నట్లుండి 3 వికెట్లు కోల్పోయి 151 పరుగులకే ఆలౌటై ఓటమి చవిచూసింది.
  • సిరీస్‌లో 0-2తో వెనుకబడ్డా.. పేసర్ల స్వర్గధామమైన జొహానెస్‌బర్గ్‌లో భారత్‌ గొప్ప ప్రదర్శనతో 63 పరుగుల విజయాన్నందుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 187 పరుగులకు (పుజారా 50, కోహ్లీ 54) ఆలౌట్‌ కాగా.. బుమ్రా (5/54), భువీ (3/44) సఫారీ జట్టును 194 పరుగులకే కట్టడి చేశారు. కోహ్లీ (41), రహానె (48), భువీ (33) పోరాడటం వల్ల రెండో ఇన్నింగ్స్‌లో 247 పరుగులు చేసిన భారత్‌ ప్రత్యర్థికి 241 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఎల్గర్‌ (86 నాటౌట్‌), ఆమ్లా (52) రాణించడం వల్ల ఒక దశలో 124/1తో ఉన్న సఫారీ జట్టు.. షమీ (5/28), బుమ్రా (2/57), ఇషాంత్‌ (2/31)ల ధాటికి 177 పరుగులకే కుప్పకూలడం వల్ల భారత్‌ 63 పరుగుల తేడాతో నెగ్గింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details