దక్షిణాఫ్రికా పర్యటనలో టీమ్‌ఇండియా శుభారంభం చేసింది. సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 113 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. మూడు టెస్టుల సిరీస్‌లో 1-0తేడాతో ఆధిక్యంలో నిలిచింది. 305 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా.. నాలుగో రోజు ఆట ముగిసేసరికి ఓవర్‌నైట్ స్కోరు 94కు మరో 97 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
IND VS SA: తొలి టెస్టులో టీమ్‌ఇండియా ఘన విజయం - టీమ్‌ఇండియా విజయం
16:27 December 30
IND VS SA: తొలి టెస్టులో టీమ్‌ఇండియా ఘన విజయం
తొలి సెషన్‌లో మూడు వికెట్లు కోల్పోయి ఫర్వాలేదనిపించినా దక్షిణాఫ్రికా.. రెండో సెషన్ తొలి రెండు ఓవర్లలోనే వరుసగా మూడు వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. తొలి సెషన్‌లో కెప్టెన్ డీన్ ఎల్గర్ (77), తెంబా బవుమా (35*) వికెట్ కాపాడుకుంటూ జాగ్రత్తగా ఆడారు. అయితే 51వ ఓవర్లో ఎల్గర్‌ను బుమ్రా ఔట్ చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే క్వింటన్ డి కాక్ (21), వియాన్ ముల్డర్ (1) పెవిలియన్ చేరారు. లంచ్ తర్వాత క్రీజులోకి వచ్చిన వాళ్లు వెంటవెంటనే వెనుదిరగడం వల్ల దక్షిణాఫ్రికా 191 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో బుమ్రా, మహ్మద్ షమి తలో మూడు.. మహమ్మద్ సిరాజ్, అశ్విన్ చెరో రెండు వికెట్లు తీశారు.
అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 174 పరుగులకు ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ, మార్కో జాన్‌సెన్ చెరో నాలుగు, ఎంగిడి రెండు వికెట్లు తీశారు.
ఇక తొలి ఇన్నింగ్స్‌లో భారత్.. ఓపెనర్లు కేఎల్ రాహుల్(123) శతకం, మయాంక్ అగర్వాల్(60) అర్ధశతకం చేయడం వల్ల 327 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి ఆరు, కగిసో రబాడ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా 197 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 130 పరుగుల ఆధిక్యం లభించింది.
సఫారీల తొలి ఇన్నింగ్స్‌లో తెంబా బవుమా (52) అర్థశతకంతో రాణించాడు. క్వింటన్ డికాక్ (34), కగిసో రబాడ (25) పరుగులు చేశారు. భారత బౌలర్లలో మహ్మద్ షమి 5, శార్దూల్ ఠాకూర్, బుమ్రా తలో రెండు, మహమ్మద్ సిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు. సిరీస్‌లో భాగంగా రెండో టెస్టు జనవరి 3న ప్రారంభం కానుంది.