ind vs Sa T20 :సఫారీ గడ్డపై భారత పోరాటం ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. స్వదేశంలో బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌లపై రాణించిన భారత బ్యాటర్లకు, సఫారీ గడ్డపై కఠిన సవాల్ ఎదురుకానుంది. ఫ్రీడమ్ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో గెలిచి ఈ పర్యటనలో శుభారంభం చేయాలని టీమ్ఇండియా భావిస్తోంది. రోహిత్ శర్మ, కోహ్లీ, బుమ్రా, హార్దిక్ పాండ్యా సహా సీనియర్ ఆటగాళ్ల గైర్హాజరీలో అనుభవం అంతగా లేని యువ జట్టు ఎలా రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు సఫారీ బౌలర్లను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. అనుభవజ్ఞులు లేని ఆస్ట్రేలియా బౌలింగ్ దళంపై స్వదేశంలో టీమిండియా బాగానే రాణించింది. అయితే దక్షిణాఫ్రికా బౌలింగ్‌ను దక్షిణాఫ్రికాలో ఎదుర్కోవడం అంత తేలిక కాదు.శుభ్‌మన్ గిల్,రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్‌వర్మలతో టీమ్ఇండియా బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది.
రుతురాజ్ గైక్వాడ్ ఆస్ట్రేలియాపై 52 బంతుల్లోనే సెంచరీ చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. జైస్వాల్, గిల్, గైక్వాడ్ వరుసగా బ్యాటింగ్‌కు రానున్నారు. నాలుగో స్థానంలో ఇషాన్ కిషన్ ఆడే అవకాశం ఉంది. ఇషాన్ కిషన్, జితేశ్ వర్మలో ఎవరికి తుది జట్టులో స్థానం దక్కుతుందో చూడాలి. తర్వాత సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ కూడా మంచి టచ్‌లో ఉన్నాడు. హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, కెప్టెన్ ఐడెన్ మాక్రమ్లతో సౌతాఫ్రికా బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉంది. హార్డ్ హిట్టర్ ట్రిస్టన్ స్టబ్స్ విధ్వంసం సృష్టిస్తున్నాడు.
టీమిండియా పేస్ విభాగమే కాస్త ఆందోళనపరుస్తోంది. సిరాజ్ చేరికతో పేస్ బౌలింగ్ కాస్త బలోపేతమైంది. టీ 20ల్లో నెంబర్ వన్ బౌలర్ రవి బిష్ణోయ్‌పై చాలా ఆశలు ఉన్నాయి. దీపక్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్ కుమార్ పేస్ దళాన్ని మోయనున్నారు. కగిసో రబాడ, ఎంగిడి గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమైనా జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, ఫెహ్లుక్వాయో పేస్‌తో భారత బ్యాటర్లకు తిప్పలు తప్పవు.
సిరీస్ షెడ్యూల్.
టీ20
- తొలి టీ20 - డిసెంబర్ 10- డర్బన్ రాత్రి 7.30
- రెండో టీ20- డిసెంబర్ 12- కెబెరా రాత్రి 8.30
- మూడో టీ20- డిసెంబర్ 14- జొహన్నెస్‌బర్గ్ రాత్రి 8.30