IND vs SA ODI: రెండో వన్డేలో భారత్‌పై దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 288 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి 48.1 ఓవర్లలోనే ఛేదించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ని ఇంకా ఒక మ్యాచ్ మిగిలుండగానే సౌతాఫ్రికా 2-0 తేడాతో కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికా ఓపెనర్లు మలన్ ( 108 బంతుల్లో 91), క్వింటన్ డికాక్ (66 బంతుల్లో 78) అర్ధశతకాలతో రాణించగా.. డసెన్ (37), మార్‌క్రమ్ (37), బవుమా (35) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో చాహల్, బుమ్రా, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ పడగొట్టారు.
లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికాకు ఓపెనర్లు శుభారంభం అందించారు. ముఖ్యంగా క్వింటన్ డికాక్ ఆది నుంచి దూకుడుగా ఆడాడు. భువనేశ్వర్ కుమార్ వేసిన రెండో ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు. మలన్ కూడా నిలకడగా ఆడాడు. దీంతో పది ఓవర్లు పూర్తయ్యేసరికి సౌతాఫ్రికా 66/0తో నిలిచింది. డికాక్ 37 బంతుల్లో అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు. తర్వాత మలన్ దూకుడు పెంచి ఆడి హాఫ్ సెంచరీ అందుకున్నాడు. 22 ఓవర్‌లో డికాక్‌ని శార్దూల్ ఠాకూర్ వెనక్కి పంపి భారత్‌కి ఊరటనిచ్చాడు. తర్వాత దూకుడుని కొనసాగిస్తూ శతకం వైపు దూసుకెళ్తున్న మలన్‌ని బుమ్రా పెవిలియన్‌కి పంపాడు. తర్వాతి ఓవర్‌లోనే బవుమా (35) చాహల్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. డసెన్, మార్‌క్రమ్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ జట్టుని విజయ తీరాలకు చేర్చారు.