IND VS SA Rahul Dravid: టీ20 లీగ్‌లో భారత ఆటగాళ్లు కెప్టెన్లుగా విజయవంతం కావడం జాతీయ జట్టుకు ఉపయోగపడుతుందని టీమ్‌ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. హార్దిక్ పాండ్య నేతృత్వంలోని గుజరాత్ తొలి ప్రయత్నంలోనే టైటిల్ నెగ్గగా.. టోర్నీలో రాహుల్ (లఖ్‌నవూ), శ్రేయస్ అయ్యర్ (కోల్‌కతా), సంజు శాంసన్ (రాజస్థాన్) కూడా సారథులుగా ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ద్రవిడ్ అలా స్పందించాడు. "టీ20 లీగ్‌లో చాలా మంది భారత కెప్టెన్లు రాణించడం మంచి విషయం. ఆ సారథుల్లో హార్దిక్ ఒకడు. జట్టును గొప్పగా నడిపించాడు. లఖ్‌నవూ కెప్టెన్‌గా కేఎల్, రాజస్థాన్ కెప్టెన్‌గా సంజు, కోల్‌కతా సారథిగా శ్రేయస్ ఆకట్టుకున్నారు. ఈ యువ బ్యాటర్లు జట్టును ముందుండి నడిపించడం చూస్తుంటే సంతోషం కలుగుతోంది. ఇది ఆటగాళ్లుగా ఎదగడానికి వారికి ఉపయోపడుతుంది. వ్యక్తులుగా ఎదగడానికి కూడా ఉపకరిస్తుంది" అని దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ నేపథ్యంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ద్రవిడ్ అన్నాడు. "భారత యువ ఆటగాళ్లు సారథులుగా తమ జట్లను మెరుగ్గా నడిపించడం వల్ల భారత జట్టుకు కూడా ప్రయోజనమే" అని చెప్పాడు.
అతడు వచ్చినందుకు సంతోషం..రోహిత్, బుమ్రా, కోహ్లీలకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతినవ్వగా.. హార్దిక్ పాండ్య పునరాగమనం చేశాడు. హార్దిక్ రాకపై ద్రవిడ్ సంతోషం వ్యక్తం చేశాడు. "హార్దిక్ తిరిగి జట్టులోకి వచ్చినందుకు సంతోషంగా ఉంది. అతడు అద్భుతమైన క్రికెటర్. పరిమిత ఓవర్ల క్రికెట్లో హార్దిక్ విశేషంగా రాణించాడు. టీ20లీగ్‌లోనూ గొప్ప ఫామ్‌ను ప్రదర్శించాడు. అతడి కెప్టెన్సీ కూడా గొప్పగా ఉంది. నాయకత్వ బృందంతో భాగంగా ఉండాలంటే కెప్టెన్సీనే ఉండాల్సిన అవసరం లేదు. హార్దిక్ మళ్లీ బౌలింగ్ చేస్తుండడం మాకు సానుకూలాంశం" అని అన్నాడు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య మొదటి టీ20 గురువారం జరుగుతుంది. రోహిత్ గైర్హాజరీలో రాహుల్ టీమ్ ఇండియాకు నాయకత్వం వహించనున్నాడు.