తెలంగాణ

telangana

ETV Bharat / sports

దక్షిణాఫ్రికాపై టీమ్​ఇండియా ఓటమి.. మాజీలు ఏమన్నారంటే?

IND VS SA ODI Series: దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్​లో టీమ్​ఇండియా ఘోరంగా ఓడిపోయింది. 0-3 తేడాతో సిరీస్​ను కోల్పోయింది. దీనిపై పలువురు మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు. వారెమన్నారంటే..

teamindia vs southafrica
టీమ్​ఇండియా వర్సెస్​ దక్షిణాఫ్రికా

By

Published : Jan 24, 2022, 5:30 PM IST

IND VS SA ODI Series: దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో టీమ్‌ఇండియా 0-3 తేడాతో ఘోర పరాజయం పాలుకావడంపై పలువురు మాజీ క్రికెటర్లు ఘాటుగా స్పందించారు. సులభంగా గెలవాల్సిన మ్యాచులను అప్పనంగా అప్పగించేశారని విమర్శలు గుప్పించారు. బ్యాటర్లు మరింత బాధ్యతాయుతంగా ఆడాల్సిన అవసరం ఉందని సూచించారు.

"భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించి ఆటగాళ్లు పెవిలియన్‌ చేరారు. కాస్త సహనంతో ఆడి ఉంటే భారత్‌ కచ్చితంగా విజయం సాధించేది. అంతర్జాతీయ స్థాయిలో మ్యాచులు ఆడుతున్నప్పుడు.. బ్యాటర్లు మరింత బాధ్యతగా ఆడాలి. సాధారణ ఆటగాడిలా ఆడితే.. ఇప్పటిలాగే సిరీస్‌ కోల్పోవాల్సి వస్తుంది. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా టీమ్ఇండియా ఒక్క తొలి టెస్టు మినహాయిస్తే.. మిగతా మ్యాచుల్లో స్థాయికి తగిన ప్రదర్శన చేయలేదు. సులభంగా గెలవాల్సిన మ్యాచులను కూడా అప్పనంగా అప్పగించేశారు. ఒక్క మ్యాచులో కూడా భారీ భాగస్వామ్యాల్ని నిర్మించలేకపోయారు. గత ఓటముల నుంచి పాఠాలు నేర్చుకోకపోవడం కూడా టీమ్‌ఇండియా ఘోర పరాజయానికి ఓ ప్రధాన కారణం" అని మాజీ క్రికెటర్‌ మదన్‌ లాల్‌ విమర్శించారు.

"గతేడాది శ్రీలంక పర్యటనలో భాగంగా భారత యువ ఆటగాళ్లు మెరుగ్గా రాణించారు. శ్రీలంకను సొంత గడ్డపైనే ఓడించి సత్తా చాటారు. సరిగ్గా ఎనిమిది నెలల తర్వాత.. టీమ్‌ఇండియా పరిస్థితి పూర్తిగా తారుమారు అయ్యింది. అత్యుత్తమ జట్లలో ఒకటైన భారత్‌.. ఒక్క మ్యాచులో పై చేయి సాధించేందుకు చాలా కష్టపడుతోంది. టీమ్‌ఇండియా మిడిలార్డర్‌లో గందరగోళం నెలకొంది. నాలుగో స్థానంలో రిషభ్‌ పంత్‌, ఐదో స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌, ఆరో స్థానంలో వెంకటేశ్ అయ్యర్ లేదా సూర్యకుమార్‌ యాదవ్‌లకు అవకాశాలు వస్తున్నాయి. కానీ, ఆయా స్థానాల్లో ఆడేందుకు వాళ్లు సిద్ధంగా లేరనుకుంటున్నాను. అందుకే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. తొలి వన్డేలో రిషభ్ పంత్‌ రాణించినా.. మిగతా మ్యాచుల్లో విఫలమయ్యాడు. శ్రేయస్‌, వెంకటేశ్‌ అయ్యర్ అంచనాలను అందుకోలేకపోయారు" అని ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు.

"దక్షిణాఫ్రికా పర్యటనను టీమ్‌ఇండియా చాలా దారుణంగా ముగించింది. సఫారీల గడ్డపై అత్యంత పేలవ ప్రదర్శనల్లో ఇదొకటిగా మిగిలిపోతుంది. ఈసారి భారత జట్టుకి సమయం కలిసి రాలేదు. బలహీన దక్షిణాఫ్రికా చేతిలో టీమ్‌ఇండియా ఓడిపోవడం దారుణం" అని సంజయ్‌ మంజ్రేకర్‌ అభిప్రాయపడ్డాడు.

ఇదీ చూడండి:

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ABOUT THE AUTHOR

...view details