IND Vs SA ODI Series 2023 :దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసిన భారత్ ఇప్పుడు వన్డే సవాల్‌కు సిద్ధమైంది. ఆదివారం నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది. జొహన్నస్‌బర్గ్‌లోని ది వాండరర్స్ స్టేడియంలో జరగనున్న తొలి వన్డేకు ఇరుజట్లు సన్నద్ధమయ్యాయి. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ సారథ్యంలోని భారత్ ఈ సిరీస్‌ను విజయంతో ఆరంభించాలని చూస్తోంది.
భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం!
మెుదటి వన్డే జరిగే వాండరర్స్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండడంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. వర్ష ప్రభావ సూచనలు ఉండటంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కావచ్చు. వాండరర్స్ మైదానంలో భారత్ రికార్డు అంత గొప్పగా ఏమి లేదు. ఇక్కడ ఎనిమిది వన్డేలు ఆడిన టీమ్ఇండియా కేవలం మూడు మ్యాచ్‌లో గెలిచి ఐదింట్లో పరాజయం చవిచూసింది. ఈ మైదానంలో అతిథ్య జట్టు ఘనమైన రికార్డు ఉండటం టీమ్ఇండియాను కలవరపెడుతోంది.
వారికి విశ్రాంతి
స్వదేశంలో జరిగిన ప్రపంచ కప్పులో అద్భుతంగా రాణించిన కేఎల్ రాహుల్ ఫామ్‌లో ఉండటం జట్టుకు సానుకూలాంశం. రాహుల్, శ్రేయస్ అయ్యర్, కులీదీప్ మినహా వన్డే ప్రపంచ కప్పులో బరిలోకి దిగిన ఆటగాళ్లుకు ఈ సిరీస్‌లో విశ్రాంతినిచ్చారు. ప్రధాన ఆటగాళ్లు గైర్హాజరీలో కుర్రాళ్ల ప్రదర్శనపైనే విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
ఓపెనర్లుగా రుతురాజ్, సాయి సుదర్శన్!
గత ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున రాణించిన సాయి సుదర్శన్‌తో కలిసి రుతురాజ్ గైక్వాడ్‌తో ఆరంభించే అవకాశం ఉంది. తిలక్ వర్మ, రజత్ పటీదార్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్, రింకూ సింగ్‌లతో బ్యాటింగ్ విభాగం బలంగా కనిపిస్తోంది. టీ20 సిరీస్‌లో రాణించిన రింకూ సింగ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అటు ఐడెమ్ మార్‌క్రమ్ నేతృత్వంలోని సఫారీ జట్టు హిట్టర్లతో నిండిపోయింది. రీజా హెండ్రిక్స్, వాండర్ డసెన్, డేవిడ్ మిల్లర్, క్లాసన్‌లతో బ్యాటింగ్ విభాగం దుర్బేధ్యంగా కనిపిస్తోంది.