IND Vs SA ODI Sanju Samson :దక్షిణాఫ్రికాతో జరిగిన నిర్మయాత్మక మూడో వన్డేలో భారత్ అదరగొట్టింది. 78 పరుగుల తేడాతో మ్యాచ్‌లో విజయం సాధించింది. ఫలితంగా 2-1తో వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. అయితే చివరి వన్డేలో భారత్ ఇన్నింగ్స్‌లో సంజూ శాంసన్ సెంచరీతో దుమ్మురేపాడు. తక్కువ అవకాశాలు, ఎక్కువ అంచనాలతో బరిలోకి దిగి అదరగొట్టాడు.
కెరీర్లోనే సంజూ శాంసన్ తొలి సెంచరీ సాధించాడు. యంగ్ క్రికెటర్ తిలక్ వర్మ (52; 77 బంతుల్లో) కుదురుకోవడానికి ఎక్కువ బంతులు తీసుకోవడంతో ఓ స్థితిలో టీమ్ఇండియా రన్‌రేటు తగ్గింది. కానీ మరో ఎండ్‌లో ఉన్న శాంసన్ బౌండరీలతో స్కోరుబోర్డు పరుగులు పెట్టించాడు. చివరకు శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా అందుకున్నాడు.
సంజు ఎమోషనల్
అయితే సెంచరీ సాధించిన తర్వాత, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న సందర్భంలో సంజు శాంసన్ మాట్లాడాడు. ''సెంచరీ సాధించినందుకు సంతోషంగా ఉంది. భావోద్వేగంగా అనిపిస్తోంది. గత కొన్ని నెలలుగా శారీరకంగా, మానసికంగా ఎంతో కష్టపడ్డా. మొత్తానికి మంచి ఫలితం వచ్చినందుకు ఆనందంగా ఉంది. కొత్త బంతితో సౌతాఫ్రికా బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు. తర్వాత పాత బంతి టైమ్‌లో బ్యాటింగ్ చేయడం సవాలుగా మారింది. కేఎల్ రాహుల్ ఔటైన తర్వాత కేశవ్ మహరాజ్ ఊపందుకున్నాడు. కానీ నేను, తిలక్ కుదురుకోవడానికి ప్రయత్నించాం. జట్టులో ఎక్సట్రా ఆల్‌రౌండర్ ఉన్నాడని 40 ఓవర్లపాటు బ్యాటింగ్ కొనసాగించాలని మేం ప్లాన్ చేశాం'' అని తెలిపాడు.
''విజయంలో నా పాత్ర ఉన్నందుకు సంతోషంగా ఉంది. పిచ్, బౌలర్లను అర్థం చేసుకోవడానికి వన్డే ఫార్మాట్‌లో సమయం ఉంటుంది. ఇక టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయడం వల్ల మరో 10-20 బంతులు ఎక్కువగా ఆడే అవకాశం ఉంటుంది. తిలక్ వర్మ గొప్పగా ఆడాడు. అతడి ఆట పట్ల దేశం గర్వంగా ఉంది. తిలక్ మరిన్ని గొప్ప ఇన్నింగ్స్‌లు సాధిస్తాడు. టీమ్ఇండియా సీనియర్ క్రికెటర్లు నెలకొల్పిన ప్రమాణాలను జూనియర్లు అందుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రయాణం చేస్తూ 2-3 రోజుల వ్యవధిలోనే మ్యాచ్‌లు ఆడటం అంత ఈజీ కాదు. అయినా సత్తాచాటుతున్నాం'' అని సంజు శాంసన్ చెప్పాడు.