తెలంగాణ

telangana

ETV Bharat / sports

దక్షిణాఫ్రికాతో భారత్ తొలి వన్డే.. అందరి కళ్లూ కోహ్లీపైనే

IND vs SA ODI: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య జనవరి 19న పార్ల్‌ వేదికగా తొలి వన్డే ప్రారంభంకానుంది. టెస్టు సిరీస్‌ను 1-2తో కోల్పోయిన టీమ్​ఇండియా.. వన్డేల్లో సత్తా చాటి అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఏడేళ్ల తర్వాత కెప్టెన్‌గా కాకుండా కేవలం ఓ ఆటగాడిగా విరాట్‌ కోహ్లీ వన్డేల్లో బరిలోకి దిగనున్నాడు. ఇరుజట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉందని క్రికెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

virat kohli
విరాట్​ కోహ్లీ

By

Published : Jan 18, 2022, 5:08 PM IST

Updated : Jan 19, 2022, 7:04 AM IST

IND vs SA ODI: దక్షిణాఫ్రికాలో మూడు టెస్టుల సిరీస్‌ను 1-2తో కోల్పోయిన టీమ్​ఇండియా పరిమిత ఓవర్ల క్రికెట్‌పై దృష్టిసారించనుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇరుజట్ల మధ్య తొలి మ్యాచ్‌ బుధవారం పార్ల్‌ వేదికగా జరగనుంది. ఏడేళ్ల తర్వాత కెప్టెన్‌గా కాకుండా కేవలం ఓ ఆటగాడిగా విరాట్‌ కోహ్లీ వన్డేల్లో బరిలోకి దిగనున్నాడు. ఇటీవల టెస్ట్‌ కెప్టెన్సీకి కూడా గుడ్‌బై చెప్పిన కోహ్లీపైనే అందరి దృష్టి నెలకొంది. రోహిత్‌ శర్మ గైర్హాజరీలో ఈ వన్డే సిరీస్‌కు కేఎల్​ రాహుల్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వచ్చే ఏడాది వన్డే ప్రపంచ కప్‌ జరగనున్న నేపథ్యంలో అందుకు ఈ సిరీస్‌ను సన్నాహకంగా భారత జట్టు భావిస్తోంది.

గతసారి దక్షిణాఫ్రికా పర్యటనలో వన్డే సిరీస్‌ను 5-1తో నెగ్గిన టీమ్​ఇండియా ఈసారి కూడా అదే జోరు కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. చివరిగా గత ఏడాది మార్చిలో భారత్‌ ఇంగ్లాండ్‌తో పూర్తిస్థాయి వన్డే జట్టుతో ఆడింది. ఆ తర్వాత జులైలో శ్రీలంక పర్యటనకు ద్వితీయ శ్రేణి జట్టు వెళ్లింది. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో మిడిల్‌ ఆర్డర్‌లో ఆడిన KL రాహుల్‌ ఈసారి శిఖర్‌ ధావన్‌కు తోడుగా ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇప్పటికే టీ20 జట్టులో చోటు కోల్పోయిన శిఖర్‌ ధావన్‌కు ఈ వన్డే సిరీస్‌ కీలకంగా మారింది. దేశవాళీ క్రికెట్‌లో రాణించి టీమ్​ఇండియాలో చోటు దక్కించుకున్న రుతురాజ్‌ గైక్వాడ్‌ వన్డే అరంగేట్రం కోసం మరికొన్ని రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి రావచ్చు.

విరాట్‌ కోహ్లీ మూడోస్థానంలో బరిలోకి దిగనుండగా.. నాలుగో స్థానం కోసం సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌ మధ్య పోటీ నెలకొంది. వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మెన్‌గా రిషభ్‌ పంత్‌ ఐదో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. ఆల్‌రౌండర్‌ కోటాలో వెంకటేశ్‌ అయ్యర్‌కు తుది జట్టులో చోటు దక్కనుంది. స్పిన్నర్లుగా అశ్విన్‌, యజువేంద్ర చాహల్‌ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక పేస్‌ బౌలింగ్‌ విభాగంలో బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌తో బంతి పంచుకునే మూడో పేసర్‌ ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ స్థానం కోసం దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, ప్రసిద్ధ కృష్ణ మధ్య పోటీ నెలకొంది. టెస్టు సిరీస్‌ సందర్భంగా గాయపడ్డ మహమ్మద్‌ సిరాజ్‌ కూడా ఫిట్‌నెస్‌ సాధించాడు

అందరి దృష్టి విరాట్​పైనే..

మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్సీకి గుడ్​పై చెప్పిన విరాట్​ కోహ్లీ.. ఆటగాడిగా ఈ వన్డేలలో ఎలాంటి ప్రదర్శన ఇస్తాడో అని క్రికెట్​ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బీసీసీఐతో ఉన్న విభేధాలను పక్కన పెట్టి ఈ వన్డేలలో తన బ్యాట్​ ద్వారా విమర్శకులకు విరాట్​ సమాధానం చెప్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. రెండేళ్లుగా అందని ద్రాక్షగా మిగిలిన సెంచరీ.. ఈ వన్డేలలోనైనా సాధిస్తాడని భావిస్తున్నారు. మరి విరాట్​ ఏం చేస్తాడో చూాడాలి.

దాదాపు ఐదేళ్ల పాటు వన్డే కెప్టెన్​గా బాధ్యతలు చేపట్టిన విరాట్​.. ఈ సిరీస్​లో మళ్లీ పూర్తిస్థాయి బ్యాటర్​గా బరిలోకి దిగనున్నాడు.

హోరాహోరీగా వన్డేలు!

మరోవైపు 2-1తో టెస్టు సిరీస్‌ నెగ్గిన ఆతిథ్య జట్టు దక్షిణాఫ్రికా వన్డేల్లోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. టెస్టుల్లో కీలక ఇన్నింగ్స్‌ ఆడిన కెప్టెన్‌ తెంబా బవుమా వన్డేల్లోనూ పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనున్నాడు. టెస్టులకు గుడ్‌బై చెప్పిన క్వింటన్‌ డికాక్‌...ఇక కేవలం వైట్‌బాల్‌ ప్లేయర్‌గా ఆడనున్నాడు. టెస్టుల్లో భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టిన మార్కో జాన్సెన్‌ వన్డేల్లోనూ వారికి సవాలు విసరనున్నాడు. టెస్టు సిరీస్‌ రసవత్తరంగా జరిగిన నేపథ్యంలో వన్డేల్లోనూ హోరాహోరీ సమరం తప్పదని క్రికెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్‌ ఆరంభంకానుంది

ఇదీ చూడండి :'దేశం కోసం ఆడుతున్నప్పుడు ఆ ఫైర్​ ఉండటం సహజమే'

Last Updated : Jan 19, 2022, 7:04 AM IST

ABOUT THE AUTHOR

...view details