Monty Panesar about Kohli Test captaincy: దక్షిణాఫ్రికాతో జరగబోయే సిరీస్‌లో టీమ్ఇండియానే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్. ఈ సిరీస్‌లో భారత జట్టు గెలవకపోతే టెస్ట్ కెప్టెన్‌గా కోహ్లీ కొనసాగడం కష్టమేనని అన్నాడు.
"టీమ్ఇండియాకు ఇది మంచి అవకాశమని భావిస్తున్నా. ఈ సిరీస్‌లో వారు గెలిచే సూచనలు కనిపిస్తున్నాయి. రవిశాస్త్రి కోచింగ్ ఫిలాసఫీతో వాళ్లకు ఎలా గెలవాలో తెలుసని నా అభిప్రాయం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పోరాడగలిగేలా ఆటగాళ్లలో నమ్మకం, ఆత్మవిశ్వాసాన్ని అతడు నింపాడు. కాబట్టి దక్షిణాఫ్రికా గడ్డపై టీమ్ఇండియా తొలిసారి టెస్ట్ సిరీస్‌లో గెలుపొంది చారిత్రక విజయాన్ని అందుకుంటుందని అనుకుంటున్నా. దక్షిణాఫ్రికా కన్నా భారత జట్టు బలంగా ఉంది. టీమ్‌లో అద్భుత ప్లేయర్లు ఉన్నారు." అని పనేసర్ పేర్కొన్నాడు.
ఫామ్‌లో లేని కారణంగా కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ ఆ బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించారు. అయితే ఈ పరిణామం కోహ్లీలో స్ఫూర్తిని నింపుతుందని అన్నాడు పనేసర్.
"ఈ సంఘటన విరాట్‌లో మరింత స్ఫూర్తిని నింపుతుందని భావిస్తున్నా. ఎందుకంటే అతడు భారీ పరుగులు చేయలేకపోతే టెస్ట్ కెప్టెన్‌గానూ అతడని తప్పించే అవకాశముంది. కాబట్టి అతడిపై ఒత్తిడి ఉన్నప్పటికీ మంచి ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ విరాట్ పరుగులు సరిగ్గా చేయలేనప్పటికీ సిరీస్ గెలిస్తే తనపై అంతగా ప్రభావం పడదు. కాబట్టి అతడు దక్షిణాఫ్రికా గడ్డపై సిరీస్ ఎలా గెలవాలనే విషయమై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. బీసీసీఐ కూడా విరాట్ నుంచి దీన్నే ఆశిస్తుందని నా అభిప్రాయం." అని పనేసర్ వెల్లడించాడు.
వన్డే కెప్టెన్‌గా కోహ్లీ స్థానంలో రోహిత్‌శర్మను నియమించడంపై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీకి మద్దతుగా నిలిచాడు పనేసర్. బోర్డు సరైన నిర్ణయమే తీసుకుందని అన్నాడు. దక్షిణాఫ్రికా పిచ్‌లు పేస్, బౌన్సీగా ఉంటాయని చెప్పిన పనేసర్.. టీమ్ఇండియాకు ఆ పిచ్‌లపై ఆడటం సవాల్‌లాంటిదని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ఇది పెద్ద ఛాలెంజ్ అని పేర్కొన్నాడు.
టీమ్ఇండియాకు ప్రధానంగా వేదిస్తున్న సమస్య మిడిలార్డర్. రహానె, పుజారా ఫామ్‌లో లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వారు మంచి ప్రదర్శన చేయాలి ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. మూడో స్థానంలో రహానె లేదా పుజారాకు బదులుగా అతడిని ఆడించే అవకాశం కూడా ఉంది. ఏదేమైనప్పటికీ టీమ్ఇండియా ఎప్పుడూ మంచి ఆటగాళ్లను తయారు చేస్తూనే ఉంటుంది. ఇక కోహ్లీ తుది జట్టులోకి ఆటగాళ్లని తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి." అని మానేసర్ అన్నాడు.
ఇదీ చూడండి:Ind vs SA: సఫారీ గడ్డపై కూడా ఈ వేగం కొనసాగనీ..