తెలంగాణ

telangana

ETV Bharat / sports

నిలవాలంటే గెలవాల్సిందే... టీమ్‌ ఇండియాకు 'సఫారీ' పరీక్ష - భారత్​ సౌతాఫ్రికా టీ20 మ్యాచ్​

IND Vs SA T20: ఒకదాని తర్వాత ఒకటి.. వరుసగా రెండు షాక్‌లు తిన్నాక.. ఇంకో ఓటమి ఎదురైతే సిరీస్‌ కోల్పోయే స్థితిలో, అచ్చొచ్చిన విశాఖలో అదరగొట్టింది యువ భారత్‌. బ్యాటుతో, బంతితో అంచనాలకు తగ్గట్లు రాణించి సఫారీలకు పర్యటనలో తొలి ఓటమి రుచి చూపించిన కుర్రాళ్లు.. ఇప్పుడు మరో కీలక సమరానికి సిద్ధమయ్యారు. తొలి గెలుపు అందుకున్న ఉత్సాహంలో ఇక సిరీస్‌ను సమం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. శుక్రవారమే దక్షిణాఫ్రికాతో నాలుగో టీ20. ఒకదాని తర్వాత ఒకటి.. వరుసగా రెండు షాక్‌లు తిన్నాక.. ఇంకో ఓటమి ఎదురైతే సిరీస్‌ కోల్పోయే స్థితిలో, అచ్చొచ్చిన విశాఖలో అదరగొట్టింది యువ భారత్‌. బ్యాటుతో, బంతితో అంచనాలకు తగ్గట్లు రాణించి సఫారీలకు పర్యటనలో తొలి ఓటమి రుచి చూపించిన కుర్రాళ్లు.. ఇప్పుడు మరో కీలక సమరానికి సిద్ధమయ్యారు. తొలి గెలుపు అందుకున్న ఉత్సాహంలో ఇక సిరీస్‌ను సమం చేయాల్సిన సమయం ఆసన్నమైంది.

IND vs SA match preview
IND vs SA match preview

By

Published : Jun 17, 2022, 7:00 AM IST

IND Vs SA T20: తీవ్ర ఒత్తిడి మధ్య విశాఖపట్నంలో అడుగు పెట్టి మూడో టీ20లో ఘనవిజయం సాధించిన టీమ్‌ఇండియా.. రాజ్‌కోట్‌లో దక్షిణాఫ్రికాతో నాలుగు టీ20లో తలపడబోతోంది. రిషబ్‌ పంత్‌ నేతృత్వంలోని యువ భారత్‌కు ఈ విజయం గొప్ప ఊరటనిచ్చి, ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఉంటుందనడంలో సందేహం లేదు. అదే సమయంలో ఉదాసీనతకు తావివ్వకుండా ఇదే తీవ్రతను రాజ్‌కోట్‌లోనూ కొనసాగించడం కీలకం. ఇక్కడ గెలిచి సిరీస్‌ను సమం చేస్తే నిర్ణయాత్మక చివరి టీ20లో టీమ్‌ఇండియాకే ఎక్కువ అవకాశాలుంటాయి.

కెప్టెన్‌.. మెరుపులెక్కడ?:ఈ సిరీస్‌లో టీమ్‌ఇండియాను బాగా కలవరపెడుతున్న అంశం.. రిషబ్‌ పంత్‌ ఫామ్‌. వివిధ ఫార్మాట్లలో అతడి రికార్డు చూసి సీనియర్లు లేని ఈ సిరీస్‌లో జట్టు పగ్గాలు అప్పగించారు సెలక్టర్లు. కానీ అతను వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ బ్యాట్స్‌మన్‌గా నిరాశపరిచాడు. 29, 5, 6.. ఇవీ అతడి స్కోర్లు. తొలి రెండు మ్యాచ్‌ల్లో పంత్‌ నాయకత్వ సామర్థ్యం మీదా సందేహాలు కలిగాయి. విశాఖలో టీమ్‌ఇండియా ఘనవిజయంతో అతను కాస్త ఒత్తిడి నుంచి బయటపడి ఉంటాడు. ఇప్పుడు బ్యాటింగ్‌లో జట్టును ముందుండి నడిపించడం, కెప్టెన్‌గానూ తనదైన ముద్ర వేయడం అవసరం. కెప్టెన్‌ అన్న ఆలోచన పక్కన పెట్టి పంత్‌ తన సహజ శైలిలో చెలరేగాలని మాజీలు సూచిస్తున్నారు. ఇషాన్‌ కిషన్‌ చక్కటి ఫామ్‌ను కనబరుస్తుండగా.. మూడో టీ20లో రుతురాజ్‌ కూడా ఫామ్‌ అందుకోవడం శుభ పరిణామం. ఆ మ్యాచ్‌లో హార్దిక్‌ కూడా అదరగొట్టాడు. శ్రేయస్‌ అయ్యర్‌ బాగానే ఆడుతున్నప్పటికీ.. అతడి నుంచి జట్టు పెద్ద ఇన్నింగ్స్‌ ఆశిస్తోంది. దినేశ్‌ కార్తీక్‌ ఫినిషర్‌గా తన బాధ్యతను నిర్వర్తించాల్సి ఉంది. తొలి టీ20లో 212 పరుగుల లక్ష్యాన్ని కూడా సఫారీ జట్టు అలవోకగా ఛేదించిన నేపథ్యంలో మొదట బ్యాటింగ్‌ చేసే అవకాశం వస్తే.. ప్రధాన బ్యాట్స్‌మెన్‌ విధ్వంసకరంగా ఆడి భారీ స్కోరు సాధించి పెట్టడం కీలకం.

ప్రాక్టీస్​ సెషన్​లో ఆటగాళ్లు

జోరు కొనసాగనీ..
తొలి మ్యాచ్‌ ప్రదర్శనను పక్కన పెడితే.. భారత బౌలర్ల ప్రదర్శన మెరుగ్గానే ఉంది. ప్రధాన స్పిన్నర్‌ చాహల్‌ గత మ్యాచ్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేశాడు. పేసర్లు భువనేశ్వర్‌, హర్షల్‌ పటేల్‌ తొలి టీ20 తర్వాత గొప్పగా పుంజుకున్నారు. అక్షర్‌ పటేల్‌, అవేష్‌ ఖాన్‌ల నుంచి జట్టు ఇంకా మెరుగైన ప్రదర్శన ఆశిస్తోంది. అవేష్‌ బాగానే బౌలింగ్‌ చేస్తున్నప్పటికీ.. సిరీస్‌లో ఇప్పటిదాకా వికెట్టే తీయలేదు. అక్షర్‌ పటేల్‌ 2 వికెట్లే పడగొట్టాడు. వీరిని పక్కన పెట్టాలనుకుంటే యువ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌తో పాటు అరంగేట్ర ఆటగాళ్లు ఉమ్రాన్‌ మాలిక్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ల్లో ఒకరు జట్టులోకి రావచ్చు. బ్యాటింగ్‌ ఆర్డర్లో ఎలాంటి మార్పులుండకపోవచ్చు. దక్షిణాఫ్రికా జట్టులో ఒక మార్పు జరగొచ్చు.

గాయం నుంచి కోలుకున్న డికాక్‌ తుది జట్టులోకి వచ్చేట్లయితే.. రీజా హెండ్రిక్స్‌పై వేటు పడుతుంది. డికాక్‌ తిరిగొస్తే ఆ జట్టు బ్యాటింగ్‌ మరింత బలోపేతం అవుతుంది. అతడితో పాటు వాండర్‌డసెన్‌, మిల్లర్‌, క్లాసెన్‌ల నుంచి భారత బౌలర్లకు ప్రధానంగా ముప్పు పొంచి ఉంది. వీరిని సాధ్యమైనంత త్వరగా పెవిలియన్‌ చేర్చడం కీలకం. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎవరూ అంత నిలకడగా రాణించట్లేదు. రబాడ, ప్రిటోరియస్‌ కాస్త భారత బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడుతున్నారు. స్పిన్నర్లు షంసి, కేశవ్‌ మహరాజ్‌ అనుకున్నంతగా సమస్యలు సృష్టించట్లేదు. అయినప్పటికీ ఈ ప్రపంచ స్థాయి స్పిన్నర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. మధ్య ఓవర్లలో దక్షిణాఫ్రికా పైచేయి సాధిస్తుంటే.. ఆ ఓవర్లలోనే భారత్‌ ఇబ్బంది పడుతోంది. ఈ సమస్యపై దృష్టిసారించాల్సిన అవసరముంది.

పరుగుల వరదే..
రాజ్‌కోట్‌ పిచ్‌ సాధారణంగా బ్యాటింగ్‌కు పూర్తి అనుకూలం. నాలుగో టీ20లోనూ పిచ్‌ భిన్నంగా ఉండకపోవచ్చు. భారీ స్కోర్లు నమోదవడం ఖాయం. చివరగా ఇక్కడ జరిగిన టీ20లో బంగ్లాదేశ్‌ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 4 ఓవర్లుండగానే ఛేదించేసింది. 2013లో ఇక్కడ ఆస్ట్రేలియాపై భారత్‌ 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం విశేషం. బౌలర్లలో స్పిన్నర్లకు కాస్త అవకాశం ఉంటుందని అంచనా.

తుది జట్లు (అంచనా)
భారత్‌:రుతురాజ్‌, ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌, పంత్‌ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), హార్దిక్‌, దినేశ్‌ కార్తీక్‌, అక్షర్‌/రవి బిష్ణోయ్‌, హర్షల్‌, భువనేశ్వర్‌, అవేష్‌, చాహల్‌.
దక్షిణాఫ్రికా:డికాక్‌/రీజా హెండ్రిక్స్‌, బవుమా, వాండర్‌డసెన్‌, ప్రిటోరియస్‌, మిల్లర్‌, క్లాసెన్‌, పార్నెల్‌, రబాడ, నోకియా, కేశవ్‌ మహరాజ్‌, షంసి.

ఇవీ చదవండి:వికెట్లు, క్యాచ్​లు, బ్యాటింగ్​ ఏదీ లేదు.. అయినా 'మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్'​!

భారత్​కు షాక్​! ఇంగ్లాండ్​ పర్యటనకు స్టార్ ఓపెనర్ దూరం.. చికిత్స కోసం జర్మనీకి

ABOUT THE AUTHOR

...view details