తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND vs SA: మరోసారి డీఆర్‌ఎస్‌ దుమారం.. కోహ్లీ ఫైర్​

IND vs SA: భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడో టెస్టులో మరోసారి డీఆర్​ఎస్​పై దుమారం రేగింది. మూడో రోజు ఆటలో ఎల్గర్‌ సమీక్షకు వెళ్లినప్పుడు నాటౌట్‌గా తేలడమే అందుకు కారణం. అసలేమైందంటే..?

IND vs SA
భారత్, దక్షిణాఫ్రికా

By

Published : Jan 14, 2022, 8:52 AM IST

IND vs SA: క్రికెట్​లో నిర్ణయ సమీక్ష పద్ధతి (డీఆర్‌ఎస్‌)పై మరోసారి దుమారం రేగింది. దక్షిణాఫ్రికాతో చివరి టెస్టు మూడో రోజు ఆటలో అశ్విన్‌ బౌలింగ్‌లో ఎల్గర్‌ సమీక్షలో నాటౌట్‌గా తేలడమే అందుకు కారణం.

ఏమైందంటే..?

సఫారీ రెండో ఇన్నింగ్స్‌ 21వ ఓవర్లో ఎల్గర్‌ ఎల్బీ కోసం జట్టు అప్పీల్‌ చేసింది. మైదానంలో ఉన్న అంపైర్‌ ఎరాస్మస్‌ ఔటిచ్చాడు. కానీ సమీక్ష కోరిన ఎల్గర్‌ కూడా రిప్లేలో మొదట బంతి గమనాన్ని చూసి పెవిలియన్‌ బాట పట్టాడు. కానీ చివరకు బంతి వికెట్ల మీద నుంచి వెళ్తున్నట్లు తేలింది. దీంతో అతను తిరిగొచ్చి బ్యాటింగ్‌ కొనసాగించాడు. ఒక్కసారిగా స్టంప్స్‌ పై నుంచి బంతి వెళ్తుందని సమీక్షలో చూపించడంతో కోహ్లి అసహనం వ్యక్తం చేశాడు.

అది కీలక వికెట్‌ కావడంతో దక్షిణాఫ్రికా అధికార ప్రసారదారైన సూపర్‌ స్పోర్ట్‌ను ఉద్దేశించి స్టంప్‌ మైక్‌ దగ్గరకు వెళ్లి వ్యాఖ్యలు చేశాడు. "బంతికి మెరుగు పెడుతున్నపుడు.. కేవలం ప్రత్యర్థి పైనే కాదు మీ జట్టుపైనా దృష్టి పెట్టాలి. ఎప్పుడూ ప్రత్యర్థి ఆటగాళ్లను పట్టుకోవాలని చూస్తారు"అని అతనన్నాడు.

ఆ వెంటనే.. "పదకొండు మందికి వ్యతిరేకంగా మొత్తం దేశం ఉంది" అని కేఎల్‌ రాహుల్‌ అనడం వినిపించింది. "సూపర్‌స్పోర్ట్‌.. మీరు గెలవాలంటే మెరుగైన మార్గాన్ని ఎంచుకోండి" అని అశ్విన్‌ మాట్లాడాడు.

అంపైర్‌ ఎరాస్మస్‌ కూడా మైదానంలోని భారీ తెరపై రిప్లే చూస్తూ.. "అది అసాధ్యం" అన్నట్లు తెలిసింది. ఆట ముగిశాక ఈ డీఆర్‌ఎస్‌ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. "దీన్ని మీరు చూశారు. మేమూ చూశాం. ఈ విషయాన్ని మ్యాచ్‌ రిఫరీకే వదిలేస్తున్నా. దీనిపై నేనేమీ మాట్లాడను"అని భారత బౌలింగ్‌ కోచ్‌ పారస్‌ తెలిపాడు.

ఇక చివరిటెస్టు మూడోరోజు ఆట పూర్తయ్యే సమయానికి దక్షిణాఫ్రికా జట్టు రెండు వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది. విజయానికి 111 పరుగుల దూరంలో ఉంది.

ఇదీ చూడండి:Pujara and Rahane: రహానే- పుజారాపై అభిమానులు ఫైర్..

ABOUT THE AUTHOR

...view details