IND vs SA: కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడోటెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రా.. తన అద్భుత ప్రదర్శనతో(5/42) ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు. ఈ క్రమంలో వ్యక్తిగత ప్రదర్శనల కన్నా జట్టు గెలిచినప్పుడే ఎక్కువ సంతృప్తి కలుగుతుందని బుమ్రా అన్నాడు.
ప్రత్యర్థి జట్టు 210 పరుగులకే ఆలౌటవ్వడంలో బుమ్రా కీలక పాత్రపోషించాడు. దీంతో భారత్ 13 పరుగుల స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీసేన 223 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్‌ఇండియా ఆట ముగిసే సమయానికి 57/2తో నిలిచింది. పుజారా (9), కోహ్లీ (14) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం 70 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ఇక రెండో రోజు ఆట ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన బుమ్రా.. తన సారథి విరాట్‌కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. పేస్‌బౌలర్లకు అండగా నిలుస్తాడని, వారిలో ఎప్పుడూ ఉత్సాహం నింపుతాడని చెప్పాడు. జట్టుకు కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తాడని తెలిపాడు. అతడి సారథ్యంలో ఆడటం బాగుంటుందని బుమ్రా పేర్కొన్నాడు. ఇక ఈ కేప్‌టౌన్ మైదానంలో ఆడటం తనకు మరింత ప్రత్యేకమని చెప్పాడు.