IND Vs SA First test: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. కేఎల్ రాహుల్(122*) సెంచరీ, మయాంక్ అగర్వాల్(60) ధనాధన్ ఇన్నింగ్స్ తోడవ్వడం వల్ల ఆటముగిసే సమయానికి టీమ్ఇండియా భారీ స్కోరు చేసింది. మూడు వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో నింగిడి ఒక్కడే మూడు వికెట్లు తీయడం విశేషం. ప్రస్తుతం క్రీజులో రాహుల్, రహానె ఉన్నారు.
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ఇండియాకు మంచి శుభారంభం దక్కింది. తొలి సెషన్లో ఓపెనర్లు కేఎల్ రాహుల్(122*) మయాంక్ అగర్వాల్ (60) అదరగొట్టారు. అయితే రెండో సెషన్ ఆరంభంలోనే వీరిద్దరి జోడీని విడగొట్టాడు లుంగి ఎంగిడి. ఇతడి బౌలింగ్‌లో మయాంక్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. తొలుత అంపైర్ ఔటవ్వలేదు. దీంతో దక్షిణాఫ్రికా రివ్యూ (సమీక్ష) కోరింది. అక్కడ ఫలితం సౌతాఫ్రికాకు అనుకూలంగా రావడం వల్ల టీమ్ఇండియా తొలి వికెట్ కోల్పోయింది. దీంతో తొలి వికెట్‌కు 117 పరుగుల భాగస్వామ్యం నమోదైంది.
మయాంక్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన పుజారా(0) గోల్డెన్ డకౌటయ్యాడు. దీంతో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. అనంతరం విరాట్ కోహ్లి క్రీజులోకి వచ్చాడు. రాహుల్‌తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. ఈ క్రమంలోనే టీ విరామం సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది టీమ్ఇండియా.