తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇతనో కొత్త దినేశ్​ కార్తీక్‌​.. మళ్లీ 15ఏళ్ల తర్వాత అలా.. - 15ఏళ్ల తర్వాత దినేశ్ కార్తీక్​

IND VS SA Dinesh Karthik: ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ తనలోని కొత్త ఆటగాడిని బయటపెట్టిన దినేశ్​ కార్తీక్​.. రాజ్​కోట్​ వేదికగా జరిగిన నాలుగో టీ20లోనూ రెచ్చిపోయాడు. 15 ఏళ్ల తర్వాత ఈ పొట్టి ఫార్మాట్లో తన తొలి అంతర్జాతీయ అర్ధసెంచరీ అందుకున్నాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి 'మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​' అందుకున్నాడు.

dinesh karthik
దినేశ్ కార్తిక్​ హాఫ్ సెంచరీ

By

Published : Jun 18, 2022, 6:56 AM IST

IND VS SA Dinesh Karthik: అది 2006 డిసెంబర్‌ 1.. టీమ్‌ఇండియా తన మొట్టమొదటి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ దక్షిణాఫ్రికాతో ఆడింది. అందులో రాణించిన దినేశ్‌ కార్తీక్‌ (28 బంతుల్లో 31) 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌'గా నిలిచాడు. ఇప్పుడు పదిహేనున్నర ఏళ్ల తర్వాత.. అదే ప్రత్యర్థితో టీ20 మ్యాచ్‌. ఇప్పుడు మళ్లీ మరింత దూకుడుతో చెలరేగిన కార్తీక్‌ జట్టును గెలిపించే ఇన్నింగ్స్‌ ఆడాడు. 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అందుకున్నాడు. 2006లో అతనాడిన జట్టులోని ఏ ఆటగాడు కూడా ఇప్పుడు ఆటలో కొనసాగడం లేదు. కానీ కార్తీక్‌ ఇప్పటికీ టీ20లు ఆడుతుండడమే కాదు.. 15 ఏళ్ల తర్వాత ఈ పొట్టి ఫార్మాట్లో తన తొలి అంతర్జాతీయ అర్ధసెంచరీ అందుకోవడం విశేషం. ఇంత సుదీర్ఘ కెరీర్‌లో కార్తీక్‌ ఆడింది కేవలం 36 టీ20లే. మాజీ కెప్టెన్‌ ధోని జట్టులోకి రావడంతో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా తన స్థానం గల్లంతైంది. అయితే అప్పుడప్పుడూ వచ్చిన అవకాశాలను కార్తీక్‌ పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేదనే చెప్పాలి. కేవలం ప్రత్యేక బ్యాటర్‌గా చోటు దక్కినా ఏవో ఒకటో రెండో మెరుపు ఇన్నింగ్స్‌లు తప్ప నిలకడగా ఆడింది లేదు.

ఈ నేపథ్యంలో 37 ఏళ్ల వయసులో అతను తిరిగి టీమ్‌ఇండియాలోకి రావడం కష్టమేనని అంతా అనుకున్నారు. కానీ ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ తనలోని కొత్త ఆటగాడిని ఆవిష్కరించింది. చెలరేగి ఆడితే పోయేదేముంది అన్నట్లుగా ఆర్సీబీ తరపున ఫినిషర్‌గా విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో అదరగొట్టాడు. 183.33 స్ట్రైక్‌రేట్‌తో 330 పరుగులు చేశాడు. దీంతో దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు జట్టులో చోటు కల్పించక తప్పని పరిస్థితి కలిగించాడు. తొలి మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 1 నాటౌట్‌, 30 నాటౌట్‌, 6 పరుగుల చొప్పున చేసిన అతనికి.. నాలుగో మ్యాచ్‌లో చెలరేగేందుకు సరైన అవకాశం దొరికింది. తొలి 8 బంతుల్లో ఆరు పరుగులే చేసిన అతను.. ఆ తర్వాత రెచ్చిపోయాడు. తన చివరి 19 బంతుల్లో 49 పరుగులు సాధించాడు. క్రీజులో కదులుతూ.. మోకాలిపై కూర్చుని.. బంతి పేస్‌ను వాడుకుంటూ.. బౌండరీలు రాబట్టాడు. అతను ఇదే జోరు కొనసాగిస్తే ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే జట్టుకు ఎంపికయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఎంత చెప్పినా వినేది లేదంటూ పంత్‌ నిర్లక్ష్యంగా ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో జట్టులో పంత్‌ స్థానాన్ని కార్తీక్‌ భర్తీ చేసే ఛాన్స్‌ కూడా ఉంది.

ఇదీ చూడండి: లెక్క సరిచేసిన టీమ్​ఇండియా.. నాలుగో టీ20లో ఘన విజయం

ABOUT THE AUTHOR

...view details